Bhagavad Gita: Chapter 1, Verse 21-22

అర్జున ఉవాచ ।
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ।। 21 ।।
యావదేతాన్ నిరీక్షేఽహం యోద్ధుకామానవస్థితాన్ ।
కైర్మయా సహ యోద్ధవ్యమ్ అస్మిన్ రణసముద్యమే ।। 22 ।।

అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; సేనయోః — సైన్యములు; ఉభయోః — రెండు; మధ్యే — మధ్యలో; రథం — రథము; స్థాపయ — నిలిపిఉంచు; మే — నా యొక్క; అచ్యుత — శ్రీ కృష్ణా, సంపూర్ణ దోషరహితుడా; యావత్ — ఎంతవరకు అయితే; ఏతాన్ — ఈ యొక్క; నిరీక్షే — చూసి; అహం — నేను; యోద్ధు-కామాన్ — యుద్ధం కొరకు; అవస్థితాన్ — నిలిపిఉన్న; కైః — ఎవరితో; మయా — నా చే; సహ — కూడి; యోద్ధవ్యమ్ — యుద్ధం చేయవలసి; అస్మిన్ — ఈ యొక్క; రణ-సముద్యమే — మహా పోరాటంలో.

Translation

BG 1.21-22: అర్జునుడు ఇలా అన్నాడు: ఓ అచ్యుతా (శ్రీకృష్ణా), దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము. ఈ మహా పోరాటంలో, రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి.

Commentary

సమస్త సృష్టికి పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడి భక్తుడు అర్జునుడు. అయినప్పటికీ, ఈ శ్లోకంలో, అర్జునుడు భగవంతుడిని తన రథాన్ని తాను కోరుకున్న చోటికి తీసుకెళ్లమన్నాడు. ఇది భగవంతునికి తన భక్తులతో ఉండే సంబంధం యొక్క మాధుర్యాన్ని తెలియచేస్తోంది. తన పట్ల భక్తుల ప్రేమకు ఋణపడి, భగవంతుడు వారికి దాసుడు అయిపోతాడు.

అహం భక్త పరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ
సాధుభిర్ గ్రస్త-హృదయో భక్తైర్ భక్త-జన-ప్రియః

(భాగవతం 9.4.63)

‘నేను సర్వ స్వతంత్రుడను అయినా, నా భక్తులకు బానిస అయిపోతాను. వారు నాకు అత్యంత ప్రియమైన వారు, మరియు నేను వారి ప్రేమకు ఋణ పడిపోతాను.’ అర్జునుడు సుఖంగా రథంలో కూర్చుని తనకి ఆదేశాలు ఇస్తుంటే, అతని భక్తికి వశుడైపోయిన శ్రీ కృష్ణ పరమాత్మ రథాన్ని నడిపే సారధి స్థానాన్ని తీస్కున్నాడు.

Watch Swamiji Explain This Verse