Bhagavad Gita: Chapter 1, Verse 47

సంజయ ఉవాచ ।
ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ ।
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ।। 47 ।।

సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; ఏవం ఉక్త్వా — ఈ విధంగా పలికిన; అర్జునః — అర్జునుడు; సంఖ్యే — యుద్ధరంగంలో; రథ ఉపస్థే — రథములో; ఉపావిశత్ — కూర్చుండి పోయెను; విసృజ్య — వదిలివేసి; స-శరం — బాణములతో సహా; చాపం — ధనుస్సును; శోక — దుఃఖముతో; సంవిగ్న — దీనస్థితిలో; మానసః — మనస్సు.

Translation

BG 1.47: సంజయుడు పలికెను: ఈ విధంగా పలికిన అర్జునుడు, దీనస్థితిలో, తీవ్ర శోకసంతప్తుడై తన బాణాలను, ధనుస్సును పక్కన జారవిడిచి, రథంలో కూలబడ్డాడు.

Commentary

మాట్లాడేటప్పుడు వ్యక్తి తరచుగా భావోద్వేగాల ప్రభావానికి లోనవుతాడు. 1.28వ శ్లోకం నుండి అర్జునుడు మొదలు పెట్టిన నిర్వేదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. తను ధర్మబద్ధంగా నిర్వర్తించవలసిన విధిని నైరాశ్యంతో వదిలివేసాడు, ఇది జ్ఞానంతో, భక్తితో భగవంతునికి శరణాగతి చేయటానికి పూర్తి విరుద్ధం. అర్జునుడు ఆధ్యాత్మిక జ్ఞానం లోపించిన అమాయకుడు ఏమీ కాదు, అన్న విషయం చెప్పటం ఇప్పుడు సమంజసం. అతడు ఊర్ధ్వ లోకాలకు వెళ్లి తన తండ్రి స్వర్గాధిపతి ఇంద్రుని దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. నిజానికి, తను పూర్వ జన్మలో ‘నరుడు’, కాబట్టి పారమార్థిక జ్ఞానం తెలిసినవాడే. (నర-నారాయణులు జంట అవతారములు, ఇందులో 'నరుడు' సిద్ధుడైన జీవాత్మ, 'నారాయణుడు' పరమాత్మ). దీనికి రుజువు ఏమిటంటే, మహాభారత యుద్ధం ముందు, యదు సైన్యాన్ని అంతా దుర్యోధనునికి వదిలేసి, అర్జునుడు శ్రీ కృష్ణుడిని తన పక్షంలోకి ఎంచుకున్నాడు. భగవంతుడే తన పక్షాన వుంటే తనకు అపజయం ఎన్నటికీ కలుగదు అని దృఢవిశ్వాసంతో ఉన్నాడు. అయినప్పటికీ, శ్రీ కృష్ణుడు, భావితరాల ప్రయోజనం కోసం, భగవద్గీత సందేశాన్ని చెప్పటానికి సంకల్పించాడు. కాబట్టి, సరియైన సమయంలో ఉద్దేశ్యపూర్వకంగానే అర్జునుడి మనస్సులో కలవరము సృష్టించాడు.

Watch Swamiji Explain This Verse