Bhagavad Gita: Chapter 1, Verse 28

అర్జున ఉవాచ ।
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ।। 28 ।।
సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ।

అర్జున ఉవాచ — అర్జునుడు అన్నాడు; దృష్ట్వా — చూసాక; ఇమమ్ — ఈ యొక్క; స్వ-జనం — బంధువులు (సొంతవారు); కృష్ణ — కృష్ణ; యుయుత్సుం — యుద్ధానికి ఉత్సాహంతో; సముపస్థితమ్ — చేరిఉన్న; సీదంతి — వణుకుతున్న; మమ — నా యొక్క; గాత్రాణి — అంగములు; ముఖం — నోరు; చ — మరియు; పరిశుష్యతి — ఎండిపోవుచున్నది.

Translation

BG 1.28: అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కృష్ణా, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి, నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవుచున్నది.

Commentary

వాత్సల్యం అనేది ప్రాకృతికమైనది అయివుండవచ్చు లేదా ఆధ్యాత్మికమైనది అయివుండవచ్చు. బంధువుల పట్ల అనురాగం అనేది మనము ఈ శరీరమే అన్న భావన వల్ల వచ్చే భౌతిక ఉద్వేగము. ఈ ప్రకారంగా, మనము ఈ శరీరమే అనుకున్నప్పుడు మన శారీరక బంధువుల పట్ల అనురాగం పెంచుకుంటాము. ఇలాంటి అనురాగము అజ్ఞానం వల్ల కలుగుతుంది మరియు ఇది మనిషిని మరింత భౌతికవాద స్పృహ లోనికి నెట్టివేస్తుంది. అంతిమంగా, ఆ అనురాగము వేదనతో ముగుస్తుంది ఎందుకంటే శరీరం అంతమయినప్పుడు కుటుంబబంధాలు కూడా అంతమౌతాయి.

మరోవైపు, పరమేశ్వరుడైన భగవంతుడు మన ఆత్మకి తండ్రి, తల్లి, స్నేహితుడు, యజమాని, మరియు సఖుడు. కాబట్టి ఆ భగవంతునితో సంబంధం, ఆత్మ దృష్ట్యా, ఆధ్యాత్మికమైన భావన. ఇది ఆత్మశక్తిని ఉద్ధరించి, బుద్ధిని ప్రకాశింప చేస్తుంది. భగవత్ ప్రేమ ఒక సముద్రం వంటిది, అన్నీ అందులోనే ఇమిడి వుంటాయి, కానీ శారీరక సంబంధీకులపై ప్రేమ సంకుచితమైనది మరియు తారతమ్యమును చూపేది. ఇక్కడ, అర్జునుడు భౌతిక అనుబంధాన్ని అనుభూతి చెందుతున్నాడు. ఇది అతన్ని నిరాశా సముద్రంలో ముంచివేస్తూ, తన కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి కూడా భయపడేట్టు చేస్తున్నది.

Watch Swamiji Explain This Verse