వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ।। 29 ।।
గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే ।
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ।। 30 ।।
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ ।
న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ।। 31 ।।
వేపథుః — వణుకుచున్న; చ — మరియు; శరీరే — శరీరమునందు; మే — నా యొక్క; రోమ-హర్షః — వెంట్రుకలు నిక్కబోడుచుకొనుట; చ — మరియు; జాయతే — కలుగుచున్నది; గాండీవం — అర్జునుడి విల్లు; స్రంసతే — జారిపోవుతున్నది; హస్తాత్ — (నా) చేతి నుండి; త్వక్ — చర్మము; చ — మరియు; ఏవ — నిజముగా; పరిదహ్యతే — అంతటా మంటపుడుతున్నది; న చ శక్నోమి — సాధ్యము కావటంలేదు నాకు; అవస్థాతుం — స్థిరంగా ఉండుట; భ్రమతి ఇవ — తిరుగుతున్నట్టుగా; చ — మరియు; మే — నా యొక్క; మనః — మనస్సు; నిమిత్తాని — శకునములు; చ — మరియు; పశ్యామి — చూస్తున్నాను; విపరీతాని — అశుభములైన; కేశవ — శ్రీ కృష్ణ , కేశి అనే రాక్షసుడను సంహరించినవాడా; న — లేదు; చ — మరియు; శ్రేయః — మంచి; అనుపశ్యామి — చూడగలుగుతున్నాను; హత్వా — చంపటం వలన; స్వ-జనం — సొంత బంధువులను; ఆహవే — యుద్ధంలో.
Translation
BG 1.29-31: నా శరీరమంతా వణుకుచున్నది; నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా విల్లు, గాండీవం, చేజారిపోతున్నది, మరియు నా చర్మమంతా మండిపోవుచున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది; ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణా, కేశి రాక్షసుడను సంహరించినవాడా, అంతటా అశుభ శకునములే కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన, మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను.
Commentary
యుద్ధ పరిణామాల గురించి ఆలోచించేసరికి, అర్జునుడు కలతచెంది శోకానికి గురి అయ్యాడు. ఏ వింటి శబ్దానికి బలమైన శత్రువులే భీతి చెందారో, అదే గాండీవం అతని చేజారి పోతున్నది. యుద్ధం చేయటం పాపము అన్న ఆలోచనతో అతని తల తిరుగుతున్నది. ఈ యొక్క అస్థిరమైన మానసికస్థితిలో, చివరికి, ఘోరమైన వైఫల్యాలను మరియు రాబోయే పరిణామాలను సూచించే మూఢ నమ్మకాలతో ఉన్న శకునములను అంగీకరించే స్థాయికి దిగజారి పోయాడు.