Bhagavad Gita: Chapter 1, Verse 34-35

ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః ।
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ।। 34 ।।
ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోఽపి మధుసూదన ।
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ।। 35 ।।

ఆచార్యాః — గురువులు; పితరః — తండ్రులు (పిన తండ్రులు, పెద తండ్రులు); పుత్రాః — కుమారులు; తథా — ఇంకా; ఏవ — వాస్తవంగా; చ — మరియు; పితామహాః — తాతలు; మాతులాః — మేనమామలు; శ్వశురాః — మామలు; పౌత్రాః — మనుమలు; శ్యాలాః — బావ-బావమరుదులు; సంబంధినాః — బంధువులు; తథా — కూడా; ఏతాన్ — వీరు; న హంతుమ్ ఇచ్ఛామి — చంపుటకు నాకు ఇష్టంలేదు; ఘ్నతః — చంపబడి; అపి — అయినప్పటికీ; మధుసూదన — శ్రీ కృష్ణ, మధు అనే రాక్షసుడను సంహరించినవాడా; అపి — అయినప్పటికీ; త్రై-లోక్య-రాజ్యస్య — ముల్లోకములపై అధిపత్యం; హేతోః — కొరకు; కిం ను — ఎం చెప్పాలి? మహీ-కృతే — భూమండలము కొరకు.

Translation

BG 1.34-35: గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావ మరుదులు, ఇంకా ఇతర బంధువులు, వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ, ఇక్కడ చేరి వున్నారు. ఓ మధుసూదనా, నా మీద వారు దాడి చేసిననూ నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించిననూ, ఈ భూ-మండలమే కాదు, ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే, ఏం తృప్తి ఉంటుంది మనకు?

Commentary

ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు అర్జునుని గురువులు; భీష్ముడు మరియు సోమదత్తుడు అతని పితామహులు; భూరిశ్రవుడు (సోమదత్తుని తనయుడు) వంటి వారు అతనికి తండ్రి వరుస; పురుజిత్తు, కుంతిభోజుడు, శల్యుడు, మరియు శకుని అతని మేనమామలు; ధృతరాష్ట్రుని వంద మంది కొడుకులు తన సోదరులు; లక్ష్మణుడు (దుర్యోధనుని తనయుడు) తన బిడ్డ వంటి వాడు. యుద్ధరంగంలో వేంచేసి ఉన్న ఈ వివిధములైన బంధువులని అర్జునుడు పేర్కొంటున్నాడు. 'అపి' (అంటే 'అయినప్పటికీ' అని అర్థం), అన్న పదాన్ని రెండు సార్లు వాడాడు. మొదట, ‘నేను వారి బంధువును మరియు శ్రేయోభిలాషిని అయినప్పటికీ వారు నన్నెందుకు చంపడానికి పూనుకున్నారు? రెండవసారి, ‘వారు నన్ను హతం చేయాలని కోరుకున్నప్పటికీ, నేను వారిని వధించాలనుకోవటం ఎందుకు?’ అని.

Watch Swamiji Explain This Verse