Bhagavad Gita: Chapter 4, Verse 26

శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి ।
శబ్దాదీన్విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ।। 26 ।।

శ్రోత్ర-ఆదీని — వినికిడి ప్రక్రియ వంటి; ఇంద్రియాణి — ఇంద్రియములు; అన్యే — ఇతరులు; సంయమ — నిగ్రహించి; అగ్నిషు — యజ్ఞాగ్నిలో; జుహ్వతి — సమర్పణ; శబ్ద-ఆదీన్ — శబ్దము మొదలైన; విషయాన్ — ఇంద్రియ తృప్తి నిచ్చే వస్తు-విషయములు; అన్యే — మరి కొందరు; ఇంద్రియ — ఇంద్రియముల; అగ్నిషు — అగ్నిలో; జుహ్వతి — సమర్పణ.

Translation

BG 4.26: మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియనిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు.

Commentary

అగ్ని అనేది తనలో సమర్పించబడిన వస్తువుల స్వభావాన్ని మార్చివేస్తుంది. బాహ్యమైన వైదిక కర్మకాండ యజ్ఞంలో, భౌతికంగా తనకు సమర్పించబడిన వాటిని అగ్ని భక్షించివేస్తుంది. అంతర్గత ఆధ్యాత్మిక సాధనలో అగ్ని అనేది సంకేతాత్మకమైనది. ఆత్మ-నిగ్రహం అనే అగ్ని, ఇంద్రియ వాంఛలను దహించివేస్తుంది.

ఇక్కడ, శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉన్న రెండు పూర్తి విరుద్ధమైన మార్గాల తేడాను వివరిస్తున్నాడు. ఒకటి, ఇంద్రియములను తిరస్కరించటం, ఈ పద్ధతిని హఠయోగ అభ్యాసంలో అనుసరిస్తారు. ఈ రకమైన యజ్ఞంలో, అత్యంత ఆవశ్యకమైన శరీర నిర్వహణకి తప్ప, మిగతా అన్ని ఇంద్రియముల క్రియలను ఆపివేస్తారు. సంకల్పబలంతో మనస్సుని పూర్తిగా ఇంద్రియముల నుండి వెనక్కి మరల్చి, అంతర్ముఖంగా ఉంచుతారు.

దీనికి వ్యతిరేకమైనది భక్తి యోగ అభ్యాసము. ఈ రెండవ రకమైన యజ్ఞంలో, ఇంద్రియములను, ప్రతి పరమాణువులో కనిపించే ఆ సృష్టికర్త యొక్క అద్భుతమైన కీర్తిని ఆరాధించటానికి వాడతారు. ఇంద్రియములు ఇక భౌతిక సుఖములు ఆనందించటానికి పనుముట్లగా వాడబడవు; సర్వత్రా భగవంతుని దర్శించటానికే అవి పరిష్కృతం చేయబడతాయి. 7.8వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు అంటాడు, ‘రసోఽహం అప్సు కౌంతేయ ’ అని, ‘అర్జునా, నీటి యందు రుచిని నేనే అని తెలుసుకో.’ ఈ ప్రకారంగానే, భక్తి యోగులు, అన్ని ఇంద్రియముల ద్వారా భగవంతుడిని దర్శించటానికే అభ్యాసం చేస్తారు.- చూసే, వినే, రుచిచూసే, భావించే, ఆఘ్రాణించే అన్నిటిలో కూడా. ఇటువంటి భక్తి యజ్ఞము హఠయోగ మార్గం కన్నా సులువైనది; పాటించటానికి ఆహ్లాదకరమైనది, మరియు ఈ మార్గం నుండి పతనమవటానికి తక్కువ అవకాశం కలది. ఒకవేళ ఎవరైనా సైకిలు తొక్కుతూ ఉన్నప్పుడు, ముందుకు వెళ్ళటం ఆగటానికి బ్రేకులు గట్టిగా వేస్తే, వారు పడిపోయే అవకాశం ఉంటుంది; కానీ దీనికి బదులుగా సైకిలు తొక్కేవాడు తన హేండిల్‌ని కుడి పక్కకో, ఎడమ పక్కకో తిప్పితే, సైకిలు సునాయాసంగా ముందుకు వెళ్ళటం ఆగిపోతుంది మరియు సమతుల్యత తోనే ఉంటుంది.

Watch Swamiji Explain This Verse