Bhagavad Gita: Chapter 4, Verse 40

అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి ।
నాయం లోకోఽస్తి న పరో న సుఖం సంశయాత్మనః ।। 40 ।।

అజ్ఞః — అజ్ఞానులు; చ — మరియు; అశ్రద్ధధానః — శ్రద్ధ/విశ్వాసం లేని వారు; సంశయ ఆత్మా — సంశయము కలవాడు; వినశ్యతి — పతనమగును; న — కాదు; అయం — ఈ యొక్క; లోకః — లోకము; అస్తి — ఉండుట; న — లేదు; పరః — తరువాతి; న – కాదు; సుఖం — సుఖసంతోషాలు; సంశయ-ఆత్మనః — సంశయాత్మునకు (అనుమానం కలవానికి).

Translation

BG 4.40: జ్ఞానము, విశ్వాసము రెండూ లేని వారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు, పతనమైపోతారు. విశ్వాసములేక, సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పర లోకంలో కూడా సుఖం ఉండదు.

Commentary

భక్తి రసామృత సింధు - సాధకులను వారి విశ్వాసం మరియు జ్ఞాన స్థాయిలను బట్టి మూడు రకాలుగా వర్గీకరించింది.

శాస్త్రే యుక్తౌ చ నిపుణః సర్వథా దృఢ-నిశ్చయః
ప్రౌఢ-శ్రద్ధో ఽధికారీ యః స భక్తావుత్తమో మతః
యః శాస్త్రాదిష్వనిపుణః శ్రద్ధావాన్ స తు మధ్యమః
యో భవేత్ కోమల శ్రద్ధః స కనిష్ఠో నిగద్యతే

(1.2.17-19)

‘శాస్త్ర పరిజ్ఞానం కలిగిఉండి మరియు దృఢ విశ్వాసం కూడా ఉన్న వ్యక్తి అత్యున్నత సాధకుడు. శాస్త్ర పరిజ్ఞానం లేకపోయినా గురువు మరియు భగవంతునిపై విశ్వాసం/నమ్మకం ఉన్న వ్యక్తి మధ్యమ స్థాయి సాధకుడు. శాస్త్ర పరిజ్ఞానం లేకుండా మరియు విశ్వాసం కూడా లేనివాడు నిమ్న స్థాయి సాధకుడు.’ శ్రీ కృష్ణుడు, ఈ మూడవ రకం వారు ఈ జన్మలో గాని లేదా ఆ పై జన్మలలో గాని సుఖము పొందలేరు అని వివరిస్తున్నాడు.

ప్రాపంచిక కార్యకలాపాలకు కూడా నమ్మకం అవసరం. ఉదాహరణకి, ఒక మహిళ హోటల్‌కి వెళ్లి, భోజనం ఆర్డర్ చేసింది అనుకుందాం, ఆమెకి ఆ హోటల్ వాళ్ళు ఆమె ఆహారంలో విషం కలపరు అన్న నమ్మకం ఉందన్నమాట. కానీ ఒకవేళ, ఆమెకి అన్నీ అనుమానాలే ఉండి, అన్నీ ఆహార పదార్థాలని మొదట రసాయన పరీక్ష చేయదలిస్తే, ఆమె తన భోజనాన్ని ఆస్వాదిస్తూ దాన్ని భుజించేదెప్పుడు? అదే విధంగా, ఒక వ్యక్తి గడ్డం చేసుకోవటానికి క్షురకుని కొట్టుకి వెళ్లి, అక్కడ కుర్చీలో కూర్చున్నాడనుకోండి. క్షురకుడు తన పదునైన కత్తిని ఆయన మెడ మీద తిప్పుతాడు. ఇప్పుడు ఆ వ్యక్తి క్షురకునిపై, తనను హత్య చేస్తాడేమో అన్న అనుమానం ఉంటే, క్షురకుడు గడ్డం గీయటానికి ఆ వ్యక్తి కుర్చీలో నిలకడగా కూర్చోలేడు. కాబట్టి, అనుమానపు వ్యక్తులకు ఈ లోకంలో గాని పరలోకంలో గాని సుఖం లేదు అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.