న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా ।
ఇతి మాం యోఽభిజానాతి కర్మభిర్న స బధ్యతే ।। 14 ।।
న — కాదు; మాం — నన్ను; కర్మాణి — కర్మలు; లింపంతి — అంటవు; న — కాదు; మే — నేను; కర్మ-ఫలే — కర్మ ఫలములను; స్పృహా — కోరుట; ఇతి — ఈ విధంగా; మాం — నన్ను; యః — ఎవరైతే; అభిజానాతి — తెలుసుకుందురో; కర్మభిః — కర్మ ఫలితములయందు; న — కాదు; సః — ఆ వ్యక్తి; బధ్యతే — బద్ధుడగుట.
Translation
BG 4.14: కర్మలు నన్ను అంటవు, నేను కర్మఫలముల యందు కూడా ఆసక్తుడను కాదు. ఎవరైతే నన్ను ఈవిధంగా తెలుసుకుందురో, వారు కర్మ బంధములలో చిక్కుకోరు.
Commentary
భగవంతుడు సంపూర్ణ-పవిత్రుడు, ఆయన ఏది చేసినా అది మంగళప్రదమైనది మరియు పవిత్రమైనది అవుతుంది. రామాయణం ఇలా పేర్కొంటున్నది:
సమరథ కహుఁ నహిం దోషు గోసాఈ,
రబి పావక సురసరి కీ నాఈఁ
‘అపవిత్రమైన వ్యక్తులు లేదా వస్తువుల సంపర్కం వలన కూడా, పరిశుద్ధమైన వ్యక్తిత్వములు దోషములచే ఎప్పుడూ కళంకితులు కారు. ఉదాహరణకి సూర్యుడు, అగ్ని, గంగా నది వంటివి.’ సూర్యరశ్మి, మూత్రపు నీటి కుంటపై పడితే సూర్యుడు కలుషితం కాడు. సూర్యుడు తన పరిశుద్ధ అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఆ అశుద్ధమును కూడా శుద్ధి చేస్తాడు. అదే విధంగా, అగ్నిలో అపవిత్రమైన పదార్థములు సమర్పించినా, అది తన స్వచ్ఛత నిలుపుకుంటుంది – అగ్ని స్వచ్ఛమైనది, మనం ఏది దానిలో వేసినా అది కూడా శుద్ధమైపోతుంది. ఇదే విధంగా, ఎన్నో మురికి కాలువలు పవిత్ర గంగా నదిలో కలుస్తుంటాయి, కాని గంగా నది మురికి కాలువ అయిపోదు – గంగా నది పవిత్రమైనది, అంతేకాక, ఆ మురికి కాలువలన్నిటినీ గంగా నదిగా మార్చివేస్తుంది. అదే విధంగా, భగవంతుడు కూడా తను చేసే కర్మల వలన కళంకితుడు కాడు.
చేసే పనుల వలన వచ్చే ఫలములను తన భోగం కోసం చేస్తే ఆ కర్మలు వ్యక్తిని కర్మబంధములలో పెనవేస్తాయి. కానీ, భగవంతుని చర్యలు స్వార్థ ప్రయోజనం కోసం చేసినవి కావు; ఆయన ప్రతిఒక్క చర్య కూడా జీవులపై కరుణతో చేసినదే. కాబట్టి, ఆయనే ఈ జగత్తునంతా ప్రత్యక్షంగానో, పరోక్షం గానో అజమాయిషీ చేస్తూ మరియు ఈ వ్యవహారంలో ఎన్నో పనులు చేసినా, ఆయనకి కర్మ ప్రతిచర్యలు అంటవు. తను ఈ కర్మ ఫల బంధాలకు అతీతుడనని శ్రీ కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు.
భగవత్-ప్రాప్తి నొందిన ఋషులు కూడా భౌతిక శక్తికి అతీతులుగా అవుతారు. వారి యొక్క అన్ని కార్యక్రమాలు, భగవత్ ప్రేమచే ప్రేరేపితమౌతాయి కనుక అటువంటి పరిశుద్ధ మనసున్న సత్పురుషులు కర్మ ఫల బంధములలో చిక్కుకోరు. శ్రీమద్భాగవతం ఇలా పేర్కొంటున్నది:
యత్పాదపంకజ పరాగ నిషేవ తృప్తాః
యోగ ప్రభావ విధుతాఽఖిల కర్మ బంధాః
స్వైరం చరంతి మునయో ఽపి న నహ్యమానాః
తస్యేఛ్చయాత్త వపుషః కుత ఏవ బంధః (10.33.35)
‘భగవంతుని పాదారవింద ధూళి సేవలోనే సంపూర్ణ తృప్తి పొందే భక్తులను ప్రాపంచిక క్రియాకలాపములు ఎన్నటికీ కళంకితం చేయవు. యోగబలముచే కర్మ-ఫల బంధముల నుండి తమను తాము విడిపించుకున్న వివేకవంతులైన మునులను కూడా ప్రాపంచిక క్రియాకలాపములు కళంకితం చేయవు. మరింక, తన స్వ-సంకల్పము చేతనే అలౌకిక రూపమును ధరించే భగవంతునికి ఈ బంధములు ఉండే ప్రశ్నేఎక్కడిది?’