యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః ।
సమః సిద్ధావసిద్దౌ చ కృత్వాపి న నిబధ్యతే ।। 22 ।।
యదృచ్ఛా— అప్రయత్నముగానే లభించిన; లాభ — లాభము; సంతుష్టో — తృప్తి; ద్వంద్వ — ద్వంద్వములకు (సుఖ-దుఃఖములవంటి); అతీతః — అతీతుడు; విమత్సరః — అసూయా రహితుడై; సమః — సమత్వముతో; సిద్దౌ — జయమునందు; అసిద్దౌ — అపజయమునందు; చ — మరియు; కృత్వా — కర్మలను చేయుచూ; అపి — ఉన్నాసరే; న, నిబధ్యతే — బంధింపబడడు.
Translation
BG 4.22: అప్రయత్నముగానే లభించిన దానితో సంతృప్తి చెంది, అసూయారహితులై, వారు జీవన ద్వంద్వములకు (సుఖ-దుఃఖాలు, లాభ-నష్టాలు వంటివి) అతీతులై ఉంటారు. అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్నా, గెలుపు-ఓటమిలలో సమత్వ బుద్ధి తో ఉండి, వారు తమ కర్మలచే బంధింపబడరు.
Commentary
ఒకే నాణానికి రెండు పక్కలు ఉన్నట్టు, భగవంతుడు కూడా ఈ ప్రపంచాన్ని ద్వంద్వములతో సృష్టించాడు - పగలు, రాత్రి; తీపి-చేదు; వేడిమి-చల్లదనం; వాన-కరువు మొదలగునవి. అందమైన పువ్వు ఉన్న గులాబి మొక్కకి, వికృతమైన ముల్లు కూడా ఉంది. జీవితం కూడా తన వంతు ద్వంద్వములను తెస్తుంది – సుఖము-దుఃఖము; గెలుపు-ఓటమి; కీర్తి-అపకీర్తి. శ్రీ రామచంద్రమూర్తి సైతం, తన దివ్య లీలలలో, అయోధ్యకి మహారాజుగా పట్టాభిషేకం అయ్యే ఒక్కరోజు ముందు వనవాసానికి పంపివేయబడ్డాడు.
ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు, ఎవ్వరూకూడా ద్వంద్వములు లేకుండా, కేవలం అనుకూల పరిస్థితులే ఉండాలని ఆశించలేరు. మరి మన జీవితంలో ఎదురయ్యే ద్వంద్వములను విజయవంతంగా ఎలా ఎదుర్కోవాలి? ఈ ద్వంద్వములకు అతీతంగా ఎదిగి అన్ని పరిస్థితులను సమానంగా స్వీకరిస్తూ, సమస్థితిలో ఉండటమే దీనికి పరిష్కారం. ఫలితాలపై ఆశ లేకుండా మన కర్తవ్యాన్ని చేస్తూపోతూ, మన కర్మ ఫలాలపై అనాసక్తి పెంచుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. మనం భగవంతుని ప్రీతి కోసం కర్మలను ఆచరించినప్పుడు, అనుకూల-ప్రతికూల ఫలితాలను ఈశ్వర సంకల్పంగా పరిగణించి రెంటినీ సంతోషంగా స్వీకరిస్తాము.