Bhagavad Gita: Chapter 4, Verse 28

ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే ।
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః ।। 28 ।।

ద్రవ్య-యజ్ఞాః — తన సంపదను యజ్ఞంగా సమర్పించి; తపః-యజ్ఞాః — కఠినమైన నిష్ఠలను యజ్ఞముగా సమర్పించి; యోగ-యజ్ఞాః — ఎనిమిది అంచెల యోగాభ్యాసమును యజ్ఞముగా చేసి; తథా — ఈ విధముగా; అపరే — ఇతరులు; స్వాధ్యాయ — వేద శాస్త్రాలను అధ్యయనం ద్వారా జ్ఞానాన్ని వృద్ధి చేసుకుని; జ్ఞాన-యజ్ఞాః — ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వృద్ది చేసుకోవటాన్ని యజ్ఞంలా సమర్పించి; చ — మరియు; యతయః — ఈ యొక్క సాధువులు; సంశిత-వ్రతాః — నియమబద్ధమైన వ్రతములను ఆచరిస్తూ.

Translation

BG 4.28: కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు, మరికొందరు కఠినమైన నిష్ఠలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు ఎనిమిదంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు, మరికొందరు, కఠినమైన నిష్ఠలను ఆచరిస్తూ వేద శాస్త్రాలని చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు.

Commentary

మనుష్యులు తమ తమ స్వభావాలలో, ప్రేరణలో, క్రియాకలాపాలలో, వృత్తులలో, ఆశయాలలో, మరియు సంస్కారాలలో (పూర్వజన్మల నుండి వచ్చే ప్రవృత్తులు) వేర్వేరుగా ఉంటారు. యజ్ఞములు అనేవి కొన్ని వందల రకాలుగా ఉంటాయని అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధపరుస్తున్నాడు. అవి భగవంతునికి అర్పించినప్పుడు అంతఃకరణ శుద్ధికి, ఆత్మ ఉద్ధరణకి ఉపయోగపడుతాయి. ఈ శ్లోకంలో ఆచరణయోగ్యమైన ఇటువంటి మూడు యజ్ఞాల గురించి పేర్కొంటున్నాడు.

ద్రవ్య యజ్ఞం. కొందరు ధనమును సంపాదించి దాన్ని భగవత్ కార్యాల కోసం దానం చేయటం వైపు మొగ్గు చూపుతారు. వారు అత్యంత క్లిష్టమైన వ్యాపార లావాదేవీలలో నిమగ్నమై ఉన్నా, తాము సంపాదించే ధనంతో భగవత్ సేవ చేయాలనే అంతర్గత దృఢ సంకల్పంతో ఉంటారు. ఈ విధంగా, వారు తమకు డబ్బు సంపాదించాలనే ఉన్న స్వభావాన్ని భక్తితో భగవత్ అర్పితముగా సమర్పణ చేస్తారు. జాన్ వెస్లీ అనే ఆంగ్ల ప్రబోధకుడు మరియు మెథడిస్ట్ చర్చి స్థాపకర్త , తన అనుయాయులకు ‘సాధ్యమైనంత సంపాదించండి. సాధ్యమైనంత పొదుపు చేయండి. సాధ్యమైనంత దానమివ్వండి’ (Make all you can. Save all you can. Give all you can.) అని చెప్పేవాడు.

యోగ యజ్ఞం. భారత తత్త్వశాస్త్రములో యోగ దర్శనమనేది, ఆరుగురు మహోన్నత మునులచే వ్రాయబడ్డ ఆరు తత్త్వ సిద్ధాంతాలలో ఒకటి; జైమిని మీమాంస దర్శనం వ్రాసాడు. వేద వ్యాసుడు వేదాంత దర్శనం వ్రాసాడు. గౌతముడు న్యాయ దర్శనం వ్రాసాడు. కణాదుడు వైశేషిక దర్శనం వ్రాసాడు, కపిలుడు సాంఖ్య దర్శనం, మరియు పతంజలి యోగ దర్శనం వ్రాసాడు. పతంజలి యోగ దర్శనం లో ఆధ్యాత్మిక పురోగతి కోసం, శారీరక ప్రక్రియలతో మొదలుపెట్టి, మనస్సుని జయించటం వరకు, 'అష్టాంగ యోగము' అనే ఎనిమిది అంచెల యోగ మార్గం వివరించబడింది. కొంతమంది ఈ మార్గానికి ఆకర్షితులై దీనిని ఒక యజ్ఞంలా ఆచరిస్తారు. కానీ, పతంజలి యోగ దర్శనం స్పష్టంగా ఏమి చెపుతుందంటే:

సమాధిసిద్ధిరీశ్వర ప్రణిధానాత్ (2.45)

‘యోగంలో సంపూర్ణత(సిద్ధి) సాధించాలంటే, నీవు ఖచ్చితంగా భగవంతునికి శరణాగతి చేయాల్సిందే’. ఈ అష్టాంగ యోగం వైపు మొగ్గు చూపేవారు భగవంతుడిని ప్రేమించటం నేర్చుకున్నప్పుడు, వారి యోగాభ్యాసమును యజ్ఞముగా, భక్తి అనే అగ్నిలో సమర్పిస్తారు. ‘జగద్గురు కృపాలుజీ యోగ్’ ఇలాంటి యోగ విధానానికి ఒక ఉదాహరణ. దీనిలో అష్టాంగ యోగ యొక్క శారీరక ఆసనాలు భగవత్ యజ్ఞంలా చేయటంతో పాటు, భగవన్నామములను కూడా జపిస్తారు. ఇటువంటి యోగాసనాల, భక్తి సమ్మేళనము సాధకుని యొక్క శారీరక, మానసిక, మరియు ఆధ్యాత్మిక పరిశుద్ధతకి దారి తీస్తుంది.

జ్ఞాన యజ్ఞం. కొంతమంది మనుష్యులు జ్ఞాన సముపార్జన వైపు మొగ్గు చూపుతారు. వేద శాస్త్ర అధ్యయనం చేస్తూ జ్ఞానాన్ని మరియు భగవంతుని పై ప్రేమని పెంపొందించుకోవటానికి ఈ స్వభావం చక్కగా సరిపోతుంది. సా విద్యా తన్మతిర్యయా (భాగవతం 4.29.49) ‘భగవంతునిపై భక్తిని పెంపొందించేదే నిజమైన జ్ఞానం.’ ఈ విధంగా అధ్యయన పరంగా మొగ్గు చూపే సాధకులు జ్ఞాన యజ్ఞంలో నిమగ్నమౌతారు. దీనిని భక్తి భావంతో పెనవేసినప్పుడు అది ప్రేమపూర్వక భగవత్ ఐక్యతకు దారితీస్తుంది.