Bhagavad Gita: Chapter 4, Verse 29-30

అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఽపానం తథాపరే ।
ప్రాణాపానగతీ రుధ్వా ప్రాణాయామపరాయణాః ।। 29 ।।
అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి ।
సర్వేఽప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః ।। 30 ।।

అపానే — లోనికి వచ్చే శ్వాస; జుహ్వతి — సమర్పణ; ప్రాణం — బయటకు వెళ్ళే శ్వాస; ప్రాణే — బయటకు వెళ్ళే శ్వాస యందు; అపానం — లోనికి వచ్చే శ్వాస; తథా — ఇంకా; అపరే — మరికొందరు; ప్రాణ — బయటకు వెళ్ళే శ్వాసలో; అపాన — మరియు లోనికి వచ్చే శ్వాస; గతీ — కదలిక; రుధ్వా — నిలిపి; ప్రాణ-ఆయామ — శ్వాశని నియంత్రించి; పరాయణాః — పూర్తిగా నిమగ్నులై ; అపరే — మరికొందరు; నియత — నిగ్రహించి; ఆహారాః — ఆహార స్వీకరణ; ప్రాణాన్ — ప్రాణ వాయువులు; ప్రాణేషు — జీవ శక్తి; జుహ్వతి — సమర్పణ; సర్వే — సమస్త; అపి — కూడా; ఏతే — ఇవి; యజ్ఞ-విదః — యజ్ఞము తెలిసినవారు; యజ్ఞ-క్షపిత — యజ్ఞకార్యములచే పరిశుద్ధి చేయబడుతూ; కల్మషాః — మలినముల నుండి.

Translation

BG 4.29-30: మరికొందరు లోనికి వచ్చే శ్వాస యందు బయటకు వెళ్ళే శ్వాసను యజ్ఞముగా సమర్పిస్తారు, వేరొకరు బయటకు వెళ్ళే శ్వాస యందు లోనికి వెళ్ళే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణ శక్తి నియంత్రణలో నిమగ్నమై, ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికివచ్చే, బయటకు వెళ్ళే శ్వాసల నియంత్రణ చేస్తుంటారు. ఇంకా మరికొందరు, ఆహారాన్ని తగ్గించి, శ్వాసను ప్రాణ శక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు. యజ్ఞం తెలిసినవారంతా ఇటువంటి ప్రక్రియల ద్వారా తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడుతారు.

Commentary

కొందరు ప్రాణాయామ అభ్యాసం వైపు ఆకర్షితులవుతారు, ప్రాణాయామం అంటే ‘శ్వాస యొక్క నియంత్రణ’ అని చెప్పవచ్చు. ఈ ప్రక్రియలో ఈ క్రిందివి ఉంటాయి :

పూరకము: శ్వాసను ఊపిరితిత్తుల లోనికి తీసుకోనే ప్రక్రియ.

రేచకము: ఊపిరితిత్తులను ఖాళీ చేసే ప్రక్రియ.

అంతర కుంభకము: గాలి పీల్చుకున్న తరువాత ఊపిరి బిగబట్టడం. లోనికి వెళ్ళే శ్వాస లో బయటకు వచ్చే శ్వాస ఈ నిలుపుదల సమయంలో తాత్కాలికంగా నిరోధించబడుతుంది.

బాహ్య కుంభకము: ఊపిరి విడిచి పెట్టిన తరువాత ఊపిరితిత్తులను ఖాళీగా ఉంచటం. బయటకు వెళ్ళే శ్వాసలో లోనికి వచ్చే శ్వాస, ఈ నిలుపుదల సమయంలో తాత్కాలికంగా నిరోధించబడుతుంది.

ఈ రెండు కుంభకములు క్లిష్టమైన ప్రక్రియలు కాబట్టి బాగా తెలిసిన గురువుల పర్యవేక్షణ లోనే వీటిని అభ్యాసం చేయాలి, లేదా అవి హాని చేయవచ్చు. ప్రాణాయామం వైపు మొగ్గు చూపే యోగులు, ఇంద్రియములను నియంత్రించటానికి, మనస్సుని కేంద్రీకరించటానికి ఈ యొక్క శ్వాస నియంత్రణ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఆ తరువాత వారి యొక్క నియంత్రించబడిన మనస్సుని యజ్ఞ పూర్వకంగా భగవంతునికి సమర్పిస్తారు.

ప్రాణం అంటే నిజానికి శ్వాస కాదు; చేతనాచేతన వస్తువులన్నిటిలో, శ్వాస యందు వ్యాపించి ఉన్న సూక్ష్మమైన జీవ శక్తి అది. వైదిక శాస్త్రాలు, శరీరంలో ఐదు రకముల ప్రాణముల గురించి చెప్పాయి - ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదానములు - ఇవి శారీరక ప్రక్రియలను నియంత్రిచటానికి పని చేస్తాయి. వీటిలో 'సమాన' మనేది జీర్ణ వ్యవస్థని నడిపిస్తుంది. కొందరు ఉపవాసం వైపు మొగ్గు చూపుతారు. తీసుకునే ఆహారం మనిషి యొక్క ప్రవర్తన మరియు నడవడిక మీద ప్రభావం చూపుతుందని తెలిసి, వారు ఆహారాన్ని తీసుకోవటాన్ని నియంత్రిస్తారు. ఈ విధమైన ఉపవాసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా భారత దేశంలో అనాదిగా ప్రాచుర్యంలో ఉంది, ఇది కూడా ఒక యజ్ఞ రూపంగా ఇక్కడ పేర్కొనబడినది. ఆహారం తగ్గించినప్పుడు, ఇంద్రియములు నీరసించిపోతాయి, దీనితో జీర్ణ వ్యవస్థను నడిపే 'సమానము' తనను తానే నిర్వీర్యం చేసుకోవటం జరుగుతుంది. కొందరు చేసే యజ్ఞం ఈ విధంగా ఉంటుంది.

జనులు ఈ విధమైన ఎన్నో రకాల నిష్ఠలను పరిశుద్ధత/పవిత్రత కోసం చేస్తుంటారు. మనోఇంద్రియముల వాంఛలను తీర్చాలనే కోరికలే అంతఃకరణ మాలిన్యానికి దారి తీస్తాయి. భౌతిక వస్తువుల సుఖాన్ని కోరే మనోఇంద్రియముల యొక్క సహజ స్వభావాన్ని నియంత్రించటమే ఈ అన్ని వ్రతాల/నిష్ఠల ప్రధాన ప్రయోజనం. ఎప్పుడైతే ఈ నిష్ఠలన్ని భగవత్ అర్పితముగా చేయబడుతాయో, వాటి ఫలితంగా అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. (అంతఃకరణ అంటే మనోబుద్ధులతో కూడిన అంతర్గత వ్యవస్థ).