తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ।
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ।। 34 ।।
తత్ — సత్యమును; విద్ధి — నేర్చుకొనుటకు ప్రయత్నించుము; ప్రణిపాతేన — ఆధ్యాత్మిక గురువుని చేరుకొని; పరిప్రశ్నేన — వినయ పూర్వక ప్రశ్నలతో; సేవయా — సేవ చేసి; ఉపదేక్ష్యంతి — ఉపదేశము చేయగలరు; తే — నీకు; జ్ఞానం — జ్ఞానము; జ్ఞానినః — జ్ఞానులు; తత్త్వ-దర్శినః — పరమ సత్యమును తెలుసుకొన్నవారు.
Translation
BG 4.34: ఒక ఆధ్యాత్మిక గురువుని చేరి పరమ సత్యమును నేర్చుకొనుము. వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయుము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థమును దర్శించినవాడు.
Commentary
యజ్ఞము అనేది జ్ఞానముతో కూడి చేయాలన్న విషయం విన్నతరువాత, సహజంగానే వచ్చే ప్రశ్న ఏమిటంటే, ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా సముపార్జించుకోవాలి? అని. శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో సమాధానం చెప్తున్నాడు, ఆయన అంటున్నాడు: 1) ఆధ్యాత్మిక గురువు దరిచేరండి 2) ఆయనని వినయంతో అడగండి 3) ఆయనకి సేవ చేయండి.
పరమ సత్యము అనేది మన స్వంత ఆలోచన/విచారణ ద్వారా అర్థమయ్యే విషయం కాదు. భాగవతంలో ఇలా పేర్కొనబడినది:
అనాద్యవిద్యా యుక్తస్య పురుషస్యాత్మ వేదనం
స్వతో న సంభవాద్ అన్యస్ తత్త్వ-జ్ఞో జ్ఞాన-దో భవేత్
(11.22.10)
‘ఆత్మ యొక్క బుద్ధి అనంత జన్మల పాటూ అజ్ఞానంచే కప్పివేయబడి ఉంది. అవిద్యచే ఆవరింపబడి ఉండటంచే, బుద్ధి తన అజ్ఞానాన్ని తన స్వంత ప్రయత్నంచే జయించలేదు. పరమ సత్యాన్ని ఎరిగిన భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ముని ద్వారా ఆ జ్ఞానాన్ని అందుకోవాలి.’
ఆధ్యాత్మిక పథంలో గురువు యొక్క ప్రాముఖ్యాన్ని, వైదిక గ్రంథాలు పదేపదే మనకు ఉపదేశిస్తున్నాయి.
ఆచార్యవాన్ పురుషో వేదః (ఛాందోగ్య ఉపనిషత్తు 6.14.2)
‘గురువు ద్వారా మాత్రమే నీవు వేదములను అర్థం చేసుకొనగలవు’. పంచదశీ ఇలా పేర్కొంటున్నది:
తత్పాదాంబురు హద్వంద్వ సేవా నిర్మల చేతసాం
సుఖబోధాయ తత్త్వస్య వివేకో ఽయం విధీయతే (1.2)
‘గురువు గారిని స్వచ్ఛమైన మనస్సుతో, సందేహములు విడిచి సేవించండి. తదుపరి ఆయన మీకు శాస్త్ర జ్ఞానాన్ని మరియు వివేచనాత్మకత ఉపదేశించి, గొప్ప ఆనందాన్ని కలిగిస్తాడు.’ జగద్గురు శంకరాచార్య ఇలా పేర్కొన్నాడు: యావత్ గురుర్న కర్తవ్యో తావంముక్తిర్న లభ్యతే, ‘గురువుకి శరణాగతి చేయకుండా నీకు భౌతిక మాయ నుండి ముక్తి లభించదు.’
జీవాత్మను నిజమైన గురువు సన్నిధిలోనికి చేర్చటం అనేది భగవంతుని యొక్క గొప్ప ఉదారమైన కృపలలో ఒకటి. కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే ప్రక్రియ ప్రాపంచిక జ్ఞానాన్ని ఆపాదించే ప్రక్రియ కన్నా విభిన్నమైనది. ప్రాపంచిక విద్యకోసం గురువు పట్ల అత్యంత గౌరవ భావం అవసరం లేదు. ఆ విద్య కోసం కేవలం బోధకుని ఫీజు/రుసుము చెల్లిస్తే సరిపోతుంది. కానీ, ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం అనేది శిష్యునికి యాంత్రికమైన బోధనా పద్ధతి ద్వారా ఆపాదించబడదు, లేదా దాన్ని ఏదో ఫీజు చెల్లించి కొనుక్కోలేము. శిష్యుడు ఎప్పుడైతే వినయము, నమ్రత పెంపొందించుకుంటాడో, శిష్యుని సేవా దృక్పథంచే గురువు ప్రసన్నమౌతాడో, గురుకృపచే అది శిష్యుని హృదయంలో ప్రకటించబడుతుంది. అందుకే ప్రహ్లాద మహారాజు అన్నాడు:
నైషాం మతిస్తావద్ ఉరుక్రమాంఘ్రిం
స్పృశత్యనర్థాపగమో యదర్థః
మహీయసాం పాదరజోఽభిషేకం
నిష్కించనానాం న వృణీత యావత్ (భాగవతం 7.5.32)
‘మనలను మనం ఒక మహాత్ముని పాద ధూళిలో తడిపివేసుకోకపోనంతవరకు, మనం అలౌకిక ఆధ్యాత్మిక స్థాయిని అనుభవించలేము.’ కాబట్టి, ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, గురువు గారిని మర్యాదతో చేరుకొని, పరమ సత్యము గురించి వినయంతో అడిగి, సేవ ద్వారా ఆయనకు ప్రీతి కలిగించ వలసిన ఆవశ్యకత గురించి వివరిస్తున్నాడు.