అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః ।
నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ ।। 36 ।।
అవాచ్య-వాదాన్ — అనరాని మాటలతో (కఠిన మాటలు); చ — మరియు; బహూన్ — చాలా; వదిష్యంతి — అంటారు; తవ — నీ యొక్క; అహితాః — శత్రువులు; నిందంతః — నిందించుచు; తవ — నీ యొక్క; సామర్థ్యం — సామర్థ్యమును; తతః — అంత కంటే; దుఃఖ-తరం — ఎక్కువ బాధ; ను — నిజముగా; కిమ్ — ఏమిటి.
Translation
BG 2.36: నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు, దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది. అయ్యో, ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా?
Commentary
ఒకవేళ అర్జునుడు యుద్ధ భూమి నుండి పారిపోతే తోటి వీరుల మధ్య అతని గొప్పతనం తగ్గిపోవడమే కాక, తను చులకనైపోతాడు. శ్రీ కృష్ణుడు నిందంతః అంటున్నాడు, అంటే 'నిందించుట, దూషించుట' అని. 'అవాచ్య వాదాన్' అంటే, 'నపుంసకుడు' వంటి కఠినమైన మాటలు. అర్జునుడి శత్రువులైన దుర్యోధనుడు వంటి వారు ‘చూడండి, ఈ చేతకాని అర్జునుడు యుద్ధ భూమి నుండి, కాళ్ళ మధ్యలో తోక ముడుచుకున్న కుక్కలాగ పారిపోతున్నాడు’ అని చాలా అనుచితమైన మాటలు మాట్లాడుతారు. ఇలాంటి హేళన భరించటం అర్జునుడికి చాల బాధాకరంగా ఉంటుంది అని శ్రీ కృష్ణుడు గుర్తుచేస్తున్నాడు.