Bhagavad Gita: Chapter 2, Verse 26

అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ ।
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి ।। 26 ।।

అథ — అయినా ఒకవేళ; చ — మరియు; ఏనం — ఈ ఆత్మ; నిత్య జాతం — ఎప్పుడూ పుడుతూ ఉంటూ; నిత్యం — ఎప్పుడూ; వా — లేదా; మన్యసే — అని నీవు భావిస్తే; మృతం — చనిపోవుట; తథా అపి — అయినా సరే; త్వం — నీవు; మహా-బాహో — గొప్ప బలముగల చేతులున్నవాడా, అర్జునా; న — కాదు; ఏవం — ఈ విధంగా; శోచితుం — శోకించుట; అర్హసి — తగును.

Translation

BG 2.26: కానీ ఒకవేళ నీవు, ఆత్మ పదే పదే జనన మరణములకు లోనగుతుంది అని అనుకున్నా సరే, ఓ మహా బాహువులు కలవాడా, ఇలా శోకించుట తగదు.

Commentary

ఆత్మ తత్త్వం గురించి వున్న వేరే సిద్ధాంతాలను అర్జునుడు నమ్మదలచాడేమో అని, శ్రీ కృష్ణుడు 'అథ' అన్న పదం వాడాడు. భారతదేశంలో ఉన్న వివిధ తాత్త్విక సిద్ధాంతాలు మరియు ఆత్మ తత్త్వంపై వాటి భిన్నమైన అవగాహనల నేపథ్యంలో ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి. భారతీయ తత్త్వజ్ఞానం చారిత్రాత్మకంగా పన్నెండు శాస్త్రాలను కలిగి ఉంది. వీటిలో ఒక ఆరు, వేదాలను ప్రామాణికంగా అంగీకరించాయి, అందుకే వాటిని ఆస్తిక దర్శనములు అంటారు. ఇవి మీమాంస, వేదాంత, న్యాయ, వైశేషిక, సాంఖ్య, మరియు యోగ దర్శనములు. మరల వీటిలో ఇంకొన్ని శాఖలు ఉన్నాయి — ఉదాహరణకి 'వేదాంత' మనేది మరో ఆరు రకాలుగా విభజించబడింది - అద్వైత వాదం, ద్వైత వాదం, విశిష్టాద్వైత వాదం, విశుద్ధాద్వైత వాదం, ద్వైతాద్వైత వాదం, మరియు అచింత్య-భేదాభేద వాదం. వీటిలో మరిన్ని ఉపశాఖలు ఉన్నాయి, ఉదాహరణకి, అద్వైత వాదం అనేది ఇలా పునర్విభజించబడింది - దృష్టి-సృష్టి వాదం, అవచ్ఛేద వాదం, బింబ-ప్రతిబింబ వాదం, వివర్త వాదం, అజాత వాదం మొదలగునవి. మనం ఇక్కడ వీటి తత్త్వ వివరాలలోనికి వెళ్ళము. ఈ సిద్ధాంతాలన్నీ వేదములని ప్రామాణికంగా అంగీకరించాయి అని తెలుసుకుంటే ప్రస్తుతానికి సరిపోతుంది. ఆ ప్రకారముగా, నిత్యమైన, మార్పులేని ఆత్మయే మన స్వీయ స్వరూపంగా అవన్నీ అంగీకరించాయి.

మిగిలిన ఆరు తత్త్వ శాస్త్ర సిద్ధాంతాలు వేదాలను ప్రామాణికంగా అంగీకరించవు. ఇవి చార్వాక వాదం, నాలుగు బౌద్ధ సిద్ధాంతాలు (యోగాచార వాదం, మాధ్యమిక వాదం, వైభాశిక వాదం, మరియు సౌతాంత్రిక వాదం) మరియు జైన మతం. వీటన్నీటికీ ఆత్మతత్త్వం గురించి వాటివాటి వివరణలు ఉన్నాయి. చార్వాక వాదం ప్రకారం, ఈ శరీరమే మనము మరియు దాని వివిధ అంగముల/భాగాల సమ్మేళనం వలన చైతన్యం ఉత్పత్తి అవుతుంది. జైన మతం ప్రకారం, ఆత్మ అనేది శరీరమంత పరిమాణములో ఉంటుంది, మరియు అది ప్రతి జన్మకి మారుతూ ఉంటుంది. బౌద్ధ సిద్ధాంతాలు శాశ్వతమైన ఆత్మ ఉనికిని ఒప్పుకోవు, మరియు దీనికి బదులుగా, ఒక జన్మ నుండి మరొక జన్మకు పునరుద్ధరించబడిన జీవ చైతన్య ప్రవాహం ఉంటుందని, ఇది వ్యక్తి యొక్క అస్తిత్వ కొనసాగింపుని కలిగిస్తుందని, పేర్కొంటున్నాయి.

శ్రీ కృష్ణుడి సమయంలో కూడా, పునరుద్ధరించబడిన జీవ చైతన్యం, అశాశ్వతమైన ఆత్మ వంటి బౌద్ధ సిద్ధాంతాల లాంటివి ఉండిఉండవచ్చు. కాబట్టి శ్రీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఒక జీవితకాలం నుండి ఇంకొక జీవితకాలంకు పునరుద్ధరించబడిన జీవ చైతన్య ప్రవాహం ఉంటుందని అర్జునుడు నమ్మినా, శోకించటము తగదు అని. ఎవరైనా ఎందుకు శోకించ కూడదు? తదుపరి శ్లోకంలో ఇక ఇది వివరించబడింది.

Watch Swamiji Explain This Verse