Bhagavad Gita: Chapter 2, Verse 47

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ।। 47 ।।

కర్మణి — విధింపబడిన (వేదవిహిత) కర్మాచరణమునందు; ఏవ — మాత్రమే; అధికారః — హక్కు; తే — నీకు; మా — లేదు; ఫలేషు — దాని ఫలముల యందు; కదాచన — ఎప్పుడూ కూడా; మా — కాదు; కర్మ-ఫల — కర్మఫలములు; హేతుః — కారణము; భూః — అవును; మా — కూడదు; తే — నీ యొక్క; సంగః — ఆసక్తి (మమకారము); అస్తు — ఉండుట; అకర్మణి — కర్మను మానుటయందు.

Translation

BG 2.47: శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ ఫలముల పైన నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు.

Commentary

ఇది భగవద్గీతలో ఒక అత్యంత ప్రసిద్ధ శ్లోకము, ఇది ఎంతగా ప్రజాదరణ పొందిందంటే భారతదేశంలో చాల మంది స్కూలు పిల్లలకి కూడా ఇది తెలుసు. ఇది కర్మ సిద్ధాంతం గురించి లోతైన అవగాహన కల్పిస్తుంది మరియు కర్మ-యోగ విషయం ఎప్పుడు చర్చించబడినా ఈ శ్లోకం ప్రస్తావించబడుతుంది. ఈ శ్లోకం కర్మ సిద్ధాంతం గురించి నాలుగు సూచనలను చెప్తున్నది. 1) నీ కర్తవ్యం చేయుము కానీ ఫలితాల గురించి పట్టించుకోకు. 2) వచ్చిన కర్మ ఫలములు నీవు అనుభవించటం కోసం కాదు. 3) పని చేసేటప్పుడు కూడా కర్తృత్వాభిమాన భావన (నేనే చేస్తున్నాను అన్న అహంకారం) విడిచిపెట్టుము. 4) కర్మలను మానివేయుటలో ఆసక్తి ఉండరాదు.

నీ కర్తవ్య నిర్వహణ చేయుము, కానీ ఫలితాల గురించి విచారించకు: మనకు మన కర్తవ్యాన్ని చేసే హక్కు ఉంది, కానీ ఫలితాలు మన ఒక్కరి ప్రయత్నం మీదనే ఆధారపడి ఉండవు. చాలా కారణాలు ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి - మన పరిశ్రమ, మన ప్రారబ్ధం (గత కర్మలు), భగవత్ సంకల్పము, ఇతరుల పరిశ్రమ, సంబంధిత అందరి ప్రారబ్ధం, ప్రదేశము, మరియు కాల పరిస్థితులు (అదృష్టము) మొదలగునవి. ఇప్పుడు మనం ఫలితాల గురించి ఆరాట పడితే అవి మనకు అనుకూలంగా లేనప్పుడల్లా ఆందోళన పడాల్సి వస్తుంది. కాబట్టి ఫలితముల గురించి ఆందోళనని విడిచి పెట్టి, కేవలం చేయవలసిన పని మీదనే శ్రద్ధ చూపమని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. నిజానికి, ఫలితాల గురించి పట్టించుకోనప్పుడే, మన పరిశ్రమ మీద పూర్తి శ్రద్ధ పెట్టగలుగుతాము, దీనితో ఇంతకు పూర్వం కంటే మంచి ఫలితాలు వస్తాయి.

హాస్యానికి దీనిని సంక్షిప్తంగా ఆంగ్లంలో ‘NATO - Not Attached to Outcome’ (నాట్ అటాచ్డ్ టు ఔట్‌కం) అనుకోవచ్చు. గోల్ఫ్ ఆడటం వంటి సాధారణ రోజువారీ కార్యక్రమానికి దీనిని అన్వయించి చూద్దాం. జనులు గోల్ఫ్ ఆడినప్పుడు ఫలితాలలో లీనమైపోతారు - వాళ్ల స్కోర్ బాగుందా, బాలేదా అని. కానీ వారు తమ ఆటపై దృష్టి పెట్టి తమ సామర్థ్యం మేర చక్కగా ఆడినప్పుడు, అదే వారికి తాము ఆడిన గోల్ఫ్ ఆటలన్నిటిలో అత్యంత ఆహ్లాదకరమైన ఆటగా అనిపిస్తుంది. అంతేకాక, వారి పూర్తి ఏకాగ్రత, కొట్టే షాట్స్ పైన ఉంటుంది కాబట్టి వారి ఆట చాలా మెరుగవుతుంది.

మనము చేసే కర్మల, పనుల ఫలితాలు మన అనుభోగం కోసం కాదు: కర్మలు చేయటం అనేది మానవ స్వభావంలో అంతర్భాగం. ఈ ప్రపంచంలోకి వచ్చాక, మనందరికీ మన కుటుంబ పరిస్థితి, సామాజిక స్థానం, వృత్తి వంటి పరంగా వేర్వేరు విధులు ఉంటాయి. ఈ పనులన్నీ చేసేటప్పుడు ఆయా కర్మల ఫలితాలు మన అనుభోగము (enjoyment) కోసం కాదు అని గుర్తుంచుకోవాలి - ఆ ఫలితాలు భగవంతుని ఆనందం కోసం ఉద్దేశింపబడినవి. ప్రతిఒక్క జీవాత్మ, పరమాత్మ యొక్క అణు అంశము (15.7వ శ్లోకం), కావున మన అన్ని కర్మల ద్వారా భగవంతుని సేవ చేయటమే మనకున్న అంతర్లీన నిజస్వభావం.

దాస భూతమిదం తస్య జగస్థావర జంగమం

శ్రీమన్నారాయణ స్వామీ జగతాం ప్రభురీశ్వరః

(పద్మ పురాణం)

 

‘సమస్త సృష్టికి ఆ భగవంతుడే ప్రభువు; చర-అచర జీవులన్నీ ఆయన సేవకులే’.

ప్రాపంచిక భౌతిక విషయాసక్తిలో, ‘ నా దగ్గర ఉన్న వాటన్నిటికీ నేనే యజమానిని. ఇదంతా నా సుఖం కోసమే. నా ఆస్తులు పెంచుకొని ఇంకా భోగించేందుకు నాకు హక్కు ఉంది’ అనే ఆలోచనా దృక్పథం ఉంటుంది. దీనికి విరుద్ధమైనది ఆధ్యాత్మిక స్పృహ. అది ఈ విధమైన ఆలోచనా దృక్పథం కలిగి ఉంటుంది, ‘భగవంతుడే సమస్త జగత్తుకి ప్రభువు, యజమాని, భోక్త. నేను కేవలం అతని నిస్వార్థ సేవకుడిని/సేవకురాలిని మాత్రమే. నాకున్నదాన్ని అంతా ఆ భగవంతుని సేవలోనే వినియోగించాలి.’ అని. ఈ ప్రకారముగా, అర్జునుడు, తానే తన కర్మల ఫలములను అనుభవించేది అని అనుకోవద్దని, శ్రీ కృష్ణుడు సూచిస్తున్నాడు.

పనిచేస్తున్నప్పుడు కూడా, చేసేది నేనే అన్న అహంకారాన్ని విడిచిపెట్టాలి: అర్జునుడిని కర్తృత్వాభిమానము అంటే 'చేసేది నేనే అన్న అహంకారాన్ని' విడిచిపెట్టాలని కృష్ణుడు కోరుకుంటున్నాడు. తను చేసే పనులలో, ముందుగానే ఆశించిన ఫలితాల గురించి వెంపర్లాట వద్దనీ, మరియు కర్మ ఫలితాలకు తనే కారణం అని అనుకోవద్దని ఉపదేశిస్తున్నాడు.

మనం పనులు చేసినప్పుడు, ఆయా కర్మలను చేసేది మనమే అని ఎందుకు అనుకోవద్దు? ఇది ఎందుకంటే, మన ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి జడ పదార్థములు (చైతన్యం లేనివి); భగవంతుడు వీటికి శక్తిని ఇచ్చి మనం ఉపయోగించుకోవటానికి వీలుగా చేస్తాడు. తత్ఫలితంగా, దేవునిచే ప్రసాదింపబడిన శక్తి ద్వారానే మనము పనులు చేయగలుగుతున్నాము. ఉదాహరణకి, వంటింట్లో ఉపయోగించే పట్టకారు జడమైనది, తనంతతానే ఏమీ చేయలేదు, కానీ ఎవరైనా తమ చేతుల ద్వారా దానికి శక్తినిస్తే, అది క్లిష్టమైన పనులను, అంటే మండే బొగ్గు తీయటం వంటివి కూడా చేయగలుగుతుంది. ఇప్పుడు మనము ఆ పట్టకారే ఈ పనులు చేస్తోంది అంటే పొరపాటుపడినట్లే. చెయ్యి దానికి శక్తి నీయకపొతే అది ఏమి చేయగలిగేది? అది బల్ల మీదనో, అరుగు మీదనో అలా అచేతనంగా పడి ఉండేది. అదే విధంగా, భగవంతుడు మన శరీరము-మనస్సు-ఆత్మ వ్యవస్థకి పని చేసే శక్తి ఇవ్వకపోతే, మనము ఏమీ చేయలేము. అందుకే మనము, ఆ భగవంతుడే మనము చేసే అన్ని పనులకు వెనుకనుండి శక్తిని ప్రసాదించేవాడు అని గుర్తుంచుకుంటూ, 'చేసేది నేనే అన్నఅహంకారాన్ని' విడిచిపెట్టాలి.

ఈ పై విషయాలన్నీ ఈ క్రింది ప్రసిద్ధ సంస్కృత శ్లోకంలో చక్కగా చెప్పబడ్డాయి:

యత్కృతం యత్కరిష్యామి తత్ సర్వం న మయా కృతం
త్వయా కృతం తు ఫలభుక్ త్వమేవ మధుసూదన

‘నేను సాధించిందంతా మరియు నేను సాధించ కోరేదంతా, నేను చేసినది కాదు. ఓ మధుసూదనా, నీవే నిజమైన కర్తవు, నీవు మాత్రమే వాటి ఫల భోక్తవు.’

క్రియాశూన్యత (చేయవలసిన పనులు చేయకుండుట) పైన ఆసక్తి వద్దు: ప్రాణుల సహజ స్వభావం ఏదో ఒక పని చేస్తుండటమే అయినా, తరచుగా పని కష్టతరంగా, గందరగోళంగా అనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో, దాని నుండి పారిపోకుండా, మనము శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన సరియైన కర్మ శాస్త్రాన్ని అర్థం చేసుకుని అమలు చేయాలి. అంతేకానీ, పని శ్రమతో కూడినది, భారమైనదని తలంచి క్రియాశూన్యతతో ఉండటం అత్యంత తగని చేష్ట. అకర్మణ్యత (చేయవలసిన పనులు చేయకుండుట) అనేది ఎప్పుడూ దేనికీ పరిష్కారం కాదు మరియు శ్రీ కృష్ణుడు దీనిని స్పష్టంగా ఖండించాడు.