వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన ।
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ ।। 41 ।।
వ్యవసాయ-ఆత్మికా — దృఢమైన; బుద్ధిః — బుద్ధి; ఏకా — ఒకటి; ఇహ — ఈ పథములో; కురు-నందన — కురు వంశీయుడా; బహు-శాఖాః — అనేక-శాఖలుగా; హి — నిజముగా; అనంతాః — అంతులేని; చ — మరియు; బుద్ధయః — బుద్ధి; అవ్యవసాయినామ్ — దృఢ సంకల్పం లేని.
Translation
BG 2.41: ఓ కురు వంశజుడా, ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా/స్థిరంగా ఉంటుంది, మరియు వారి లక్ష్యము ఒక్కటే. కానీ, దృఢసంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది.
Commentary
మమకారాసక్తి అనేది మనస్సు యొక్క లక్షణం. ఇదెలా వ్యక్తమవుతుందంటే, మనస్సు పదేపదే మమకార వస్తు/విషయం వైపు పరుగులు తీస్తుంది, అవి వ్యక్తులు, ఇంద్రియ విషయములు, ప్రతిష్ఠ, శారీరక సుఖాలు, పరిస్థితులు మొదలగునవి కావచ్చు. కాబట్టి ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క తలంపులు పదేపదే మనస్సుకు వస్తుంటే అది, దాని పట్ల మన మనస్సుకి అనుబంధం ఏర్పడిఉంది అన్నదానికి సూచన కావచ్చు. కానీ, అనుబంధం/మమకారాసక్తి ఏర్పరుచుకునేది మనస్సు అయినప్పుడు ఈ యొక్క అనుబంధం/మమకార విషయాలలో శ్రీ కృష్ణుడు బుద్ధిని ఎందుకు తీస్కోస్తున్నాడు? అనుబంధం/మమకారాలను తొలగించటంలో బుద్ధికి ఏమైనా పాత్ర ఉందా?
మన శరీరంలో సూక్ష్మమైన 'అంతఃకరణ' ఉంటుంది, వ్యావహారికంగా దానిని హృదయం అంటారు. ఇది మనస్సు, బుద్ధి, మరియు అహంకారం అనే వాటిని కలిగి ఉంటుంది. ఈ సూక్ష్మ యంత్రంలో ‘బుద్ధి’ అనేది 'మనస్సు' కంటే ఉన్నతమైనది. బుద్ధి నిర్ణయాలు చేస్తే, మనస్సు కోరికలను సృష్టించి, బుద్ధి నిశ్చయించిన ఆ విషయ వస్తువులతో అనుబంధం పెంచుకుంటుంది. ఉదాహరణకి, ఒకవేళ బుద్ధి గనక సంతోషానికి డబ్బే మూలం అని నిర్ణయిస్తే, మనస్సు డబ్బు కోసం వెంపర్లాడుతుంది. ఒకవేళ, పేరు ప్రఖ్యాతులే జీవితంలో ముఖ్యం అని బుద్ధి నిశ్చయిస్తే, అప్పుడు మనస్సు పేరుప్రతిష్ఠల కోసం వాంఛిస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, బుద్ధి యందు ఉన్న జ్ఞానం ప్రకారంగా, మనస్సు కోరికలను పెంపొందించుకుంటుంది.
రోజంతా మనం మనష్యులం మనస్సుని బుద్ధి ద్వారా నియంత్రిస్తూనే ఉంటాము. ఇంట్లో కూర్చున్నప్పుడు హాయిగా కాళ్ళు చాపుకుని మనస్సుకి నచ్చినట్టుగా కూర్చుంటాము. కానీ, కార్యాలయంలో (ఆఫీసు) లో కూర్చున్నప్పుడు అధికారికంగా కూర్చుంటాము. ఆఫీసు క్రమబద్ధత మన మనస్సుకి నచ్చి కాదు, దాని ఇష్టానికి వదిలేస్తే ఇంట్లో ఉండే అనధికార వాతావరణమే కావాలంటుంది. కానీ, ఆఫీసులో అధికారిక ప్రవర్తన అవసరము అని బుద్ధి నిర్ణయిస్తుంది. కాబట్టి, బుద్ధి అనేది మనస్సుని నియంత్రించటం వలన, మనస్సు యొక్క సహజ స్వభావానికి విరుద్ధంగా, కార్యాలయ మర్యాద కోసం, మనము రోజంతా నిబద్ధతతో ఆఫీసులో కూర్చుంటాము. ఇదే విధంగా, దాని ఇష్టానికి వదిలేస్తే, మనస్సు ఆఫీసు పని చేయటానికి ఇష్టపడదు, ఇంట్లో కూర్చుని టెలివిజన్ చూసేందుకే మొగ్గు చూపుతుంది. కానీ, జీవనోపాధి కోసం ఆఫీసులో పని చేయటం అవసరం అని 'బుద్ధి' నిర్ణయిస్తుంది. కాబట్టి, మళ్లీ మనస్సు యొక్క సహజ స్వభావాన్ని, బుద్ధి నియంత్రిస్తుంది, మరియు జనులు రోజుకి ఎనిమిది గంటలు లేదా ఆ పైగా పని చేస్తారు.
ఈ పై ఉదాహరణలు, మానవులగా మన బుద్ధికి మనస్సుని నియంత్రించే సామర్థ్యం ఉంది, అని నిరూపిస్తున్నాయి. ఈ విధంగా, మనం సరైన విజ్ఞానంతో బుద్ధిని పెంపొందించుకొని, సరైన దిశలో మనస్సుకి మార్గనిర్దేశం చేయడానికి దానిని ఉపయోగించాలి. బుద్ధి యోగము అంటే, అన్నీ పనులు భగవంతుని ప్రీతి కోసమే అని బుద్ధిలో దృఢ నిశ్చయం చేసుకోవటం ద్వారా కర్మ ఫలాల పట్ల ఆసక్తిరహితంగా ఉండగలిగే కళ. అలాంటి దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి, లక్ష్యంపై ఏకాగ్రదృష్టితో, విల్లు నుండి విడిచిపెట్టిన బాణంలా ఈ పథంలో దూసుకెళ్తాడు. సాధనలోని పై స్థాయిలలో ఈ సంకల్పం ఎంత బలంగా అవుతుందంటే, ఇక ఏదీ కూడా సాధకుడిని ఆ పథం నుండి తప్పించలేదు. సాధకుడు/సాధకురాలు ఇలా అనుకుంటారు, ‘ఎన్ని కోట్ల అవాంతరాలు నా దారిలో వచ్చినా, ప్రపంచమంతా నన్ను ఖండించినా, నా ప్రాణాలే వదిలివేయాల్సి వచ్చినా, నా సాధనని మాత్రము విడిచిపెట్టను.’ అని. కానీ, ఎవరి బుద్ధి పలు-విధాలుగా ఉంటుందో వారి మనస్సు ఎన్నో దిశలలో పరిగెడుతుంటుంది. వారు ఈశ్వర పథంలో పయనించడానికి కావలసిన మనస్సు యొక్క ఏకాగ్రతని పెంపొందించుకోలేరు.