శ్రీ భగవానువాచ ।
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ।
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ।। 11 ।।
శ్రీ-భగవాన్-ఉవాచ — శ్రీ భగవానుడు పలికెను; అశోచ్యాన్ — శోకింపతగని; అన్వశోచః — శోకిస్తున్నావు; త్వం — నీవు; ప్రజ్ఞా-వాదాన్ — ప్రాజ్ఞతతో కూడిన మాటలు; చ — మరియు; భాషసే — పలుకుతున్నావు; గత-ఆసూన్ — చనిపోయినవారు; అగత అసూన్ — బ్రతికున్నవారు; చ — మరియు; న అనుశోచంతి — ఎప్పుడూ శోకించరు; పండితాః — పండితులు/వివేకవంతులు.
Translation
BG 2.11: భగవంతుడు ఇలా అన్నాడు: నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ శోకింపకూడని దాని కోసం శోకిస్తున్నావు. ప్రాణములు పోయిన వారి గురించి గానీ బ్రతికున్న వారి గురించి గానీ, పండితులైనవారు శోకింపరు.
Commentary
ఈ శ్లోకంతో మొదలిడి, శ్రీ కృష్ణుడు తన ప్రసంగమును ఒక మహోత్కృష్టమైన ప్రారంభ ప్రతిపాదనతో ఆరంభిస్తున్నాడు. అర్జునుడు, తనకు మాత్రం ఒప్పు అనిపించే కారణాల వలన శోకిస్తున్నాడు. కానీ, కృష్ణుడు అతనిపై జాలి పడలేదు, సరికదా, అతని వాదనని నీరుగార్చాడు. కృష్ణుడు అంటున్నాడు, ‘అర్జునా, నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడావనుకుంటున్నావు, కానీ నీవు అమాయకత్వంతో ప్రవర్తిస్తున్నావు, మాట్లాడుతున్నావు. ఎంత పెద్ద కారణం ఉన్నా శోకం అనేది మాత్రం తగదు. పండితులు-వివేకము కలిగినవారు-ఎప్పుడూ శోకింపరు, అది బ్రతికున్నవారి కోసమైనా లేదా చనిపోయిన వారి కోసమైనా సరే. కాబట్టి బంధువులను సంహరించడంలో నీవు ఊహించుకునే దుఃఖం నిజానికి ఒక భ్రమ, మిథ్య మాత్రమే, అది నీవు పండితుడవు కావు అని నిరూపిస్తున్నది.’ అని.
శోకానికి అతీతంగా ఉన్న జ్ఞానిని చూడాలంటే గీతా శాస్త్రంలో ఎక్కువ దూరం వెళ్ళనవసరం లేదు; స్వయంగా భీష్మ పితామహుడే దీనికి చక్కటి ఉదాహరణ. అతను జనన-మరణ రహస్యాలను లోతుగా తెలుసుకుని, పరిస్థితుల యొక్క ద్వంద్వములకు అతీతంగా ఎదిగిన ఋషి. ఎలాంటి పరిస్థితిలోనైనా నిర్మలమైన మనస్సుతో ఉండగలిగి, చివరికి, భగవత్ సేవకి ఉపకరించేది అయితే అధర్మ పక్షాన యుద్ధం చేయటానికి కూడా ఒప్పుకున్నాడు. భగవంతునికి శరణాగతి చేసిన వారు, ఫలితాల చేత ప్రభావితం కాకుండా, అన్ని సందర్భాలలో తమ విధిని నిర్వర్తిస్తూ పోతుంటారు, అని ఉదాహరణగా చూపించాడు. అలాంటి వ్యక్తులు ఎప్పటికీ శోకింపరు ఎందుకంటే వారు ప్రతీదాన్నీ ఈశ్వర అనుగ్రహంలా స్వీకరిస్తారు.