బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే ।
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ।। 50 ।।
బుద్ధి-యుక్తః — జ్ఞాన సంపన్నుడవై; జహాతి — త్యజించుము; ఇహ — ఈ జన్మలో; ఉభే — రెంటినీ; సుకృత-దుష్కృతే — మంచి, చెడు కార్యములు; తస్మాత్ — కాబట్టి; యోగాయ — యోగము కొరకు; యుజ్యస్వ — గట్టిగా ప్రయత్నింపుము; యోగః — యోగ అంటే; కర్మసు కౌశలమ్ — నేర్పుతో పని చేసే కళ.
Translation
BG 2.50: వివేకముతో ఈ ఫలాసక్తిరహిత కర్మ శాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించును. కాబట్టి, నైపుణ్యంతో (సరియైన దృక్పథంతో) పని చేయటం అనే, యోగ అభ్యాసము చేయుము.
Commentary
తరచుగా, కర్మయోగ శాస్త్రం విన్న పిదప, జనులు ఒక సందేహం వ్యక్తం చేస్తారు; ఫలితాలపై ఆసక్తి/మమకారం వదిలేస్తే, వారి కార్యనిర్వహణ శక్తి తరిగిపొదా? అని. స్వార్థ ప్రయోజనాలను విడిచి పనిచేస్తే మనపని లోని నాణ్యత ఏ మాత్రం తగ్గదని; పైగా, మన నైపుణ్యత ఇంకా మెరుగవుతుందని, శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
తన చికిత్సా ప్రక్రియలో రోగులను కత్తితో కోసే ఒక చిత్తశుద్ధిగల శస్త్రచికిత్సా వైద్యుడిని ఉదాహరణగా పరిశీలిద్దాం. అతను తన విధిని సమత్వ బుద్ధితో నిర్వర్తిస్తాడు, రోగి బ్రతికినా లేదా ఒకవేళ మరణించినా అతను చలించడు. ఎందుకంటే, అతను తన ధర్మాన్ని నిస్వార్థంగా, తన శక్తి మేర, ఫలితంపై మమకారం లేకుండా చేస్తున్నాడు. కాబట్టి, ఒకవేళ శస్త్రచికిత్స ప్రక్రియలో రోగి మరణించినా ఆయనకు హత్య చేసిన అపరాధ భావన రాదు. కానీ, అదే వైద్యుడి ఏకైక బిడ్డకి శస్త్రచికిత్స చేయవలసి వస్తే, అతనికి ఆ పని చేసే ధైర్యం ఉండదు. ఫలితముపై ఉన్న మమకారం వల్ల శస్త్రచికిత్స సరిగా చేయలేనేమో అని భయం ఉంటుంది, కాబట్టి వేరొక వైద్యుడిని ఆశ్రయిస్తాడు. ఫలితములపై ఉన్న మమకారం మన నైపుణ్యాన్ని పెంచదు; పైగా మన సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుంది, అని దీని ద్వారా మనకు తెలుస్తున్నది. దీనికి బదులుగా, మమకారము/బంధము లేకుండా పని చేస్తే, భయం, ఆందోళన, చికాకు, ఉద్విగ్నత లేదా గాభరా లేకుండా మన గరిష్ఠ నైపుణ్య సామర్థ్యంతో పని చేయవచ్చు.
అదే విధంగా, అర్జునుడి స్వంత ఉదాహరణ కూడా ఫలితములపై మమకారం విడిచిపెడితే అది తన సామర్థ్యం మీద ప్రతికూల ప్రభావం ఏమీ చూపదని తేటపరచుతున్నది. భగవద్గీత వినక ముందు, అర్జునుడు రాజ్యం కోసం యుద్ధం చేయగోరాడు. శ్రీ కృష్ణుడి ద్వారా భగవద్గీత విన్న తరువాత, అతను భగవంతుని పట్ల కర్తవ్యంగా, శ్రీ కృష్ణుడి ప్రీతి కోసం యుద్ధం చేసాడు. అతను అప్పటికీ వీర యోధుడే; కానీ తన అంతర్గత దృక్పథం/ప్రేరణ మారిపోయింది. తన కర్తవ్యాన్ని మమకార బంధాలు లేకుండా చేయటం అనేది అతన్ని ఏమీ తక్కువ సామర్థ్యం కలవాడిని చేయలేదు. నిజానికి దానికి విరుద్ధంగా, అతను మరింత ఉత్సాహంతో పోరాడాడు ఎందుకంటే తన పని ఇప్పుడు ప్రత్యక్ష భగవత్ సేవ అయిపోయింది.