నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా ।
న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్ ।। 66 ।।
న-అస్తి — ఉండదు; బుద్ధిః — బుద్ధి; అయుక్తస్య — ఐక్యము కాని; న — కాదు; చ — మరియు; అయుక్తస్య — ఐక్యము కాని; భావనా — ఆలోచనలో; న — ఉండదు; చ — మరియు; అభావయతః — ఐక్యమవని వారు; శాంతిః — శాంతి; అశాంతస్య — అశాంతితో ఉన్నవారికి; కుతః — ఎక్కడ; సుఖం — సుఖము.
Translation
BG 2.66: కానీ, మనస్సు-ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి, స్థిరమైన బుద్ధి కానీ, నిలకడైన భగవత్ ధ్యాస కానీ ఉండవు. ఎవరైతే మనస్సుతో భగవంతుని యందు ఎన్నడూ ఐక్యమవడో వానికి శాంతి ఉండదు; మరియు మనశ్శాంతి లోపించినవాడు సంతోషంగా ఎలా ఉండగలడు?
Commentary
ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పిన సారాంశాన్ని, ఈ శ్లోకం మొదట వ్యతిరేకంగా చెప్పి, తదుపరి అది తప్పని సూచించటం ద్వారా, బలపరుస్తున్నది. ఆగ్లంలో చెప్పాలంటే, ఇంతకు క్రితం శ్రీకృష్ణుడు ‘Know God; know peace.’ (భగవంతుడిని తెలుసుకో; శాంతిని పొందు) అన్నాడు, ఇప్పుడు ‘No God; no peace.’ (భగవంతుడు లేకపోతే శాంతి లేదు) అంటున్నాడు. మనస్సుని, ఇంద్రియములను నియంత్రణ చేయటం నేర్చుకోని వాడు భగవంతుని ధ్యానం చేయలేడు, దివ్య ఆనందాన్ని కూడా పొందలేడు. ఉన్నతమైన అనుభూతి రుచి చూడకుండా, నిమ్న స్థాయి రుచిని త్యజించటం సాధ్యం కాదు, అలాంటి వ్యక్తి, పుష్పం లోని మకరందాన్ని తేనెటీగ విడిచిపెట్టలేనట్టుగా, ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు.
రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం
భాస్వానుద్వేష్యతి హసిష్యతి పంకజశ్రీః
ఏవం విచింతయతి కోశగతే ద్విరేఫే
హా హంత హంత నళినీం గజ ఉజ్జహార (సూక్తి సుధాకరం)
ఈ ప్రఖ్యాత సంస్కృత శ్లోకం ఒక తేనెటీగ కథను చెపుతుంది. ఒక తేనెటీగ ఓ తామర పూవుపై, దాని మకరందాన్ని గ్రోలుతూ, కూర్చొని ఉంది. సూర్యుడు అస్తమించే కొలదీ, ఆ పూవు రెక్కలు మూసుకోసాగాయి. కానీ, ఆ తేనెటీగ తన ఇంద్రియ సుఖాలను అనుభవించటంలో ఎంత ఆసక్తితో ఉందంటే దానికి ఎగిరిపోబుద్ధికాలేదు. అది ‘ఇంకా పువ్వు మూసుకుపోవటానికి సమయం ఉంది. ఇంకొంచెం మకరందం ఆస్వాదించనీ’ అని అనుకుంది. అదే విధంగా, మరణానికి ఖచ్చితమైన సూచికగా ముసలితనం వచ్చినా, మనం ప్రాపంచిక భోగాలను అనుభవించటంలోనే నిమగ్నమై ఉంటాము.
ఈలోగా, చీకటి అయింది, తామర పూవు పూర్తిగా మూసుకుపోయింది, అందులో ఆ తేనెటీగ చిక్కుకుపోయింది. అది ఇలా, ‘పోనీలే! ఈ రాత్రికి ఈ నాకు ఇష్టమైన పువ్వులోనే ఉంటాను, రేప్పొద్దున్న పూరేకులు విచ్చుకున్నప్పుడు, నేను ఎగిరిపోతాను’ అనుకుంది. ‘కాష్ట భేదో నిపుణోపి సంగృహీ కుణ్థితో భవతి పద్మ విభేదే”, “ఒక తేనెటీగకి చెక్కకొయ్య తొలిచే శక్తి ఉంటుంది. కానీ, చూడండి, ఇంద్రియ విషయములపై ఉన్న మమకారం చూడండి, చెక్కని కూడా తొలిచే సామర్థ్యం ఉన్న తేనెటీగ, ఈ సుకుమారమైన తామర రేకులలో చిక్కుకుపోయింది.’ కాసేపట్లో, ఒక ఏనుగు వచ్చి తామరను కాండం నుండి తెంపి దాన్ని మింగేసింది. తేనెటీగ ఆ తామరపువ్వుతో సహా కలిసి ఆ ఏనుగు కడుపులోకి వెళ్ళిపోయింది. తేనెటీగ అనుకుంది, ‘నా ప్రియమైన తామర ఎటో పోతోంది, దానితో పాటే పోవటం నాకు సంతోషమే’ అని. కాసేపటి తరువాత అది చనిపోయింది.
ఇదే విధంగా, మనం మానవులం కూడా ఇంద్రియములను తృప్తి పరచటం లోనే నిమగ్నమై ఉండి, భగవంతుని భక్తిలో పాల్గొనమని సాధువులు చెప్పిన సందేశాన్నిపట్టించుకోము. చిట్టచివరికి, మృత్యువు రూపంలో కాలమే మనలను కబళిస్తుంది. ఎవరైతే ఇంద్రియములను నిగ్రహించి భక్తితో ఉండరో, వారిని మాయ తన మూడు ప్రకారాల దుఃఖాలతో బాధిస్తూనే ఉంటుంది, అని ఇక్కడ శ్రీ కృష్ణుడు అంటున్నాడు. భౌతిక వాంఛలు ఎక్జిమా దురద వంటివి, ఎంత తీర్చుకుంటే అంత తీక్ష్ణమవుతాయి. ఇటువంటి ప్రాపంచిక స్థితిలో నిజమైన ఆనందంతో ఎలా ఉండగలము?