యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ ।
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ।। 69 ।।
యా — ఏదైతే; నిశా — రాత్రి; సర్వ-భూతానాం — అన్ని ప్రాణులకు; తస్యాం — దాని యందు; జాగర్తి — మేల్కొని ఉండు; సంయమీ — ఆత్మ నియంత్రణ/సంయమం కల; యస్యాం — దేనిలో అయితే; జాగ్రతి — మేల్కొని ఉండు; భూతాని — ప్రాణులు; సా — అది ; నిశా — రాత్రి; పశ్యతః — చూచును; మునేః — ముని.
Translation
BG 2.69: అన్నీ ప్రాణులూ దేన్నయితే పగలు అనుకుంటాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి, మరియు అన్నీ ప్రాణులకూ ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు.
Commentary
శ్రీ కృష్ణుడు ఇక్కడ పగలు రాత్రులను ఉపమానంగా ప్రయోగించాడు. జనులు తరచుగా ఈ శ్లోక పదాలని ఉన్నదున్నట్లుగా తీసుకొని, తాత్పర్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒకానొక కాలంలో 'ఖడే శ్రీ బాబా' (నిల్చునే ఉండే యోగి), అనే ఆయన ఉండేవాడు. ఆయన శిష్యులు, ఆయన ఒక గొప్ప ముని అని చెప్పేవారు. అతను ముప్పై-ఐదు సంవత్సరములు నిద్ర పోలేదు! తన గదిలో బాహుమూలాలలో వేలాడే తాడు ఆధారంగా నిలబడే ఉండేవాడు. నిటారుగా నిలబడే ఉండటానికి తాడుని సహాయంగా వాడేవాడు. ఇలాంటి హానికరమైన నిష్ఠని ఆచరించటానికి ప్రేరణ ఏమిటని అడిగినప్పుడు, ఈ భగవత్ గీత శ్లోకాన్ని ఉదహరించేవాడు. ‘అన్ని ప్రాణులు రాత్రిగా చూసేదానిని, జ్ఞాని పగలుగా చూస్తాడు.’ అని. దీనిని అభ్యాసం చేయటానికి, రాత్రి పూట నిద్ర పోవటం మానేసాడు. ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాడు! అంత సేపు నిలబడే ఉండటం వలన, అతని పాదాలు, పిక్కలు వాచిపోయినాయి; అలా నిలబడే ఉండటం తప్ప ఇంకా ఏమీ చేయలేక పోయేవాడు.
శ్రీ కృష్ణుడి మాటలకు నిజమైన అర్థం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. లౌకిక దృక్పథం లోనే ఉండేవారు భౌతిక వస్తు, విషయముల భోగమే నిజమైన జీవిత పరమార్థం అనుకుంటారు. ప్రాపంచిక విలాసాల ఆనందమే జీవితంలో విజయమనుకుంటారు అంటే ‘పగలు’, మరియు ఇంద్రియ సుఖాలు లేకపోవడమే చీకటి అంటే ‘రాత్రి’ అనుకుంటారు. మరో పక్క, దివ్య జ్ఞానంతో కూడిన వివేకవంతులు, ఇంద్రియ భోగాలని, ఆత్మకి హానికరమైనవిగా తెలుసుకుంటారు, కాబట్టి వాటిని ‘రాత్రి’ (చీకటి) గా పరిగణిస్తారు. ఇంద్రియ వస్తు/విషయముల నుండి దూరంగా ఉండటమే ఆత్మ ఉద్ధరణకి అవసరం అని భావించి దానిని ‘పగలు’ (వెలుగు) గా పరిగణిస్తారు. ఈ అర్థంలో పదాలను వాడటం ద్వారా, శ్రీ కృష్ణుడు, యోగులకు ఏదైతే రాత్రి అయిందో అది ప్రాపంచిక మనస్తత్వ జనులకు పగలు; ఏది ప్రాపంచిక జనులకు పగలు అనిపిస్తుందో అది యోగులకు రాత్రి - అని అంటున్నాడు.