విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః ।
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ।। 71 ।।
విహాయ — త్యజించి; కామాన్ — ప్రాపంచిక కోరికలు; యః — ఎవరైతే; సర్వాన్ — అన్నీ; పుమాన్ — వ్యక్తి; చరతి — ఉండునో; నిఃస్పృహః — అత్యాశ లేకుండా; నిర్మమః — నేను, నాది అన్న భావన లేకుండా; నిరహంకారః — అహంకారము లేకుండా; సః — అతను; శాంతిం — నిజమైన శాంతి; అధిగచ్ఛతి — పొందును.
Translation
BG 2.71: ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా, నేను/నాది అన్న భావన లేకుండా, మరియు అహంకార రహితముగా ఉంటాడో, అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది.
Commentary
ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, ఒక వ్యక్తి యొక్క ప్రశాంతతని భంగం చేసే వాటిని వివరించి, వాటిని త్యజించమని అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు.
భౌతిక/ప్రాపంచిక వాంఛలు: మనము ఏదైనా కోరికను మనస్సులో పెంచుకుంటే, ఆ తరుణమే, లోభము, క్రోధముల ఉచ్చులోకి వెళ్తాము. ఎలాగైనా మనము చిక్కుకు పోయినట్టే. కాబట్టి అంతర్గత ప్రశాంతతకి దారి, కోరికలను తీర్చుకోవటంలో లేదు, వాటిని నిర్మూలించుకోవటంలో ఉంది.
అత్యాశ/దురాశ/లోభము: అసలుకి, భౌతిక ఉన్నతి కోసం అత్యాశ అనేది మనకున్న అమూల్యమైన సమయాన్ని ఘోరంగా వృధా చేసుకోవటమే. అంతేకాక, అదొక అంతులేని పరుగు. అభివృద్ధిచెందిన దేశాలలో చాలా కొద్ది మందికి మాత్రమే తిండికి, బట్టలకు లోటు ఉంది, అయినా వారు అశాంతితో ఉంటారు; ఇది ఎందుకంటే వారిలో తృష్ణ/అత్యాశ ఇంకా తీరలేదు. ఈ విధంగా, సంతృప్తి అనే సంపత్తి కలిగినవారే గొప్ప ఐశ్వర్యవంతులు.
అహం/అహంకారము: మనుష్యుల మధ్య వచ్చే చాల మటుకు పొట్లాటలు ఈ ‘అహం’ వల్లనే జనిస్తాయి. ‘వాట్ దే డోంట్ టీచ్ యు ఎట్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్’ (What They Don’t Teach You At Harvard Business School) అనే పుస్తకం రాసిన మార్క్ హెచ్ మకోర్మాక్ (Mark H McCormack) అనే రచయిత ఇలా అన్నాడు : ‘చాలా వరకు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ , (సంస్థలలో ఉన్నతస్థాయి అధికారులు), రెండు కాళ్ళు రెండు చేతులు పొడుచుకు వచ్చిన పెద్ద అహంకార బుడగలు.’ గణాంకాలు పరిశీలిస్తే, చాలామంది ఉన్నత స్థాయి అధికారులు తమ ఉద్యోగం పోగొట్టుకోవటానికి కారణం, వారికి పనిలో నైపుణ్యం లేక కాదు, వ్యక్తుల మధ్య సమస్యల వలన. అహంకారాన్ని పెంచి పోషించు కోకుండా, దానిని త్యజించటంలోనే ప్రశాంతతకి మార్గముంది.
స్వామిత్వం/నాది అనే భావన: ‘నాది’ అన్న భావన అజ్ఞానం వలన వస్తుంది, ఎందుకంటే ఈ భూగోళం అంతా భగవంతునిదే. మనం ఖాళీ చేతులతో వచ్చాము, ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్లి పొతాము. మరిక ఈ ప్రాపంచిక వస్తువులు మనవి అని ఎలా అనుకుంటాము?