Bhagavad Gita: Chapter 2, Verse 40

నేహాభిక్రమనాశోఽస్తి ప్రత్యవాయో న విద్యతే ।
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ।। 40 ।।

న — కాదు; ఇహ — దీనిలో; అభిక్రమ — ప్రయత్నములు; నాశః — నష్టము; అస్తి — ఉండును; ప్రత్యవాయః — ప్రతికూల ఫలితములు; న — కాదు; విద్యతే — ఉండును; సు-అల్పం — ఏ కొంచెము; ఆపి — కూడా; అస్య — దీని; ధర్మస్య — ధర్మము యొక్క; త్రాయతే — కాపాడును; మహతః — గొప్ప; భయాత్ — ప్రమాదం నుండి.

Translation

BG 2.40: ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు, ఎలాంటి నష్టము కానీ వ్యతిరేక ఫలితములు కానీ కలుగవు. కొద్దిగా సాధన చేసినా అది మనలని పెద్ద ప్రమాదం నుండి కాపాడును.

Commentary

మనం ఎదుర్కునే గొప్ప ప్రమాదం ఏమిటంటే మనకు వచ్చే జన్మలో మానవ శరీరం లభించక పోవచ్చు; బదులుగా, నిమ్న స్థాయి జీవ జాతులలోకి అంటే పశువులు, పక్షులు వంటివి, లేదా అధోలోక జీవజాతుల్లోకి వెళ్ళవచ్చు. మానవ జీవితం మనకు ఎలాగూ వచ్చేదేలే అని భావించలేము, ఎందుకంటే తదుపరి ఎలాంటి జన్మ ఉండాలో, మన కర్మలను బట్టి మరియు మన జ్ఞానం యొక్క స్థాయిని బట్టి నిర్ణయింపబడుతుంది.

84 లక్షల జీవరాశుల జాతులు ఉన్నాయి. మానవుల కంటే తక్కువ స్థాయిలో ఉన్న - జంతువులు, పక్షులు, చేపలు, పురుగులు, మరియు ఇతర అన్నీ – వాటికి మన మానవుల లాగా పరిణితి చెందిన బుద్ధి లేదు. అయినా అవి కూడా సాధారణ పనులైన తినటం, నిద్రపోవటం, రక్షించుకోవటం, మరియు సంభోగం వంటివి చేస్తుంటాయి. ఒక ఉన్నత ప్రయోజనం కోసం, తమను తాము ఉద్ధరించుకోటానికి ఉపయోగించుకోటానికి మానవులకు జ్ఞాన శక్తి ఇవ్వబడింది. ఒకవేళ మనుష్యులు తమ బుద్ధిని జంతువులు కూడా చేసే తినటం, నిద్రపోవటం, సంభోగం, మరియు రక్షించుకోవటం వంటి కార్యాలకే కానీ విలాస వంత రూపంలో చేయటానికి, ఉపయోగిస్తే అది మానవ శరీరాన్ని దుర్వినియోగం చేసినట్టే. ఉదాహరణకి తినటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటే, వారికి ఒక పంది శరీరం సరిగ్గా సరిపోతుంది, ఆ ప్రకారముగా వారికి వచ్చే జన్మలో పంది శరీరం ఇవ్వబడుతుంది. ఒకవేళ నిద్ర పోవటం తమ జీవిత లక్ష్యంగా పెట్టుకుంటే భగవంతుడు వారికి పోలార్ ఎలుగుబంటి శరీరం మంచిగా సరిపోతుందని, అదే వారికి వచ్చే జన్మలో కేటాయిస్తాడు. కాబట్టి గొప్ప ప్రమాదం ఏమిటంటే మనకు వచ్చే జన్మలో మానవ జన్మ లభించక పోవచ్చు. వేదాలు ఇలా పేర్కొంటున్నాయి:

 

ఇహ చేదవేదీదథ సత్యమస్తి న చేదిహావేదీన్మహతీ వినష్టిః

(కేనోపనిషత్తు 2.5)

 

‘ఓ మానవుడా, మానవ జన్మ ఒక దుర్లభమైన అవకాశం. దీనిని నీవు నీ లక్ష్యం చేరుకోవటానికి సద్వినియోగం చేసుకోకపోతే, నీవు చాలా నష్టపోతావు.’ (కేనోపనిషత్తు 2.5). ఇంకా వేదాలు ఇలా పేర్కొంటున్నాయి:

ఇహ చేదశకద్ బోద్ధుం ప్రాక్ శరీరస్య విస్రసః
తతః సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే

(కఠోపనిషత్తు 2.3.4)

 

‘భగవత్ప్రాప్తి కోసం ఈ జన్మలో గట్టిగా ప్రయత్నించక పొతే, నీవు ఎన్నో జన్మలలో 84 లక్షల రకాల జీవ రాశులలో పడి తిరుగుతుంటావు.’

కానీ, మనం ఒకసారి ఆధ్యాత్మిక సాధన యొక్క ప్రయాణం మొదలుపెడితే, దాన్ని ఈ జన్మలో పూర్తిచేయలేకపోయినా, భగవంతుడు మనకు ఆ ఉద్దేశము ఉంది అని గమనిస్తాడు. కాబట్టి, ఆ ప్రయాణాన్ని ఎక్కడ ఆగిపోయిందో అక్కడనుండే మొదలు పెట్టడానికి మానవ జన్మని తిరిగి ప్రసాదిస్తాడు. ఈ విధంగా, మనకు ఒక పెద్ద ప్రమాదం తప్పుతుంది.

అంతేకాక, ఈ మార్గంలో చేసిన ఏ ప్రయత్నం వలన ఎప్పటికీ ఎటువంటీ నష్టం కలుగదు అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. ఎందుకంటే, ప్రస్తుత జీవితంలో మనము కూడబెట్టుకున్న భౌతిక సంపద అంతా మరణ సమయంలో ఇక్కడే వదిలి వేయాలి. కానీ, యోగపథంలో మనము ఏదేని ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తే, భగవంతుడు దానిని భద్రపరిచి, దాని ప్రతిఫలాలు వచ్చేజన్మ లో ఇచ్చి, మళ్లీ ఎక్కడ అయితే వదిలామో అక్కడినుండి తిరిగి పురోగతి సాధించేటట్టు చేస్తాడు. ఈ విధంగా అర్జునుడికి దాని ప్రయోజనము ఉపదేశించిన శ్రీ కృష్ణుడు ఇప్పుడు మమకారాసక్తి లేకుండా పని చేసే విజ్ఞానాన్ని గురించి ఇక చెప్పటం ప్రారంభిస్తున్నాడు .