యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేఽర్జున ।
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ ।। 34 ।।
యయా — దేనిచేతనైతే; తు — కానీ; ధర్మ-కామ-అర్థాన్ — కర్తవ్యము, సుఖాలు, మరియు సంపద; ధృత్యా — దృఢ సంకల్పము ద్వారా; ధారయతే — కలిగిఉంటారో; అర్జున — అర్జునా; ప్రసంగేన — మమకారాసక్తి చేత; ఫల-ఆకాంక్షీ — ఫలములపై ఆసక్తి; ధృతిః — దృఢ నిశ్చయము; సా — అది; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; రాజసీ — రాజసికము.
Translation
BG 18.34: ఫలాపేక్షచే ప్రేరితమై ధర్మము (విధులు), కామము (సుఖములు), మరియు అర్థము(సంపద) పట్ల ఆసక్తితో ఉండే స్థిరచిత్తము రాజసిక ధృతి అని చెప్పబడును.
Commentary
ధృతి అనేది కేవలం యోగులలోనే ఉండదు. ప్రాపంచిక మనస్తత్వం ఉన్న జనులు కూడా తమతమ ఆశయసాధనలో అత్యంత దృఢ సంకల్పముతో ఉంటారు. కానీ, వారి సంకల్పం అనేది వారి యొక్క పరిశ్రమ యొక్క ఫలములను భోగించాలనే కోరికచే ప్రేరేపితమై ఉంటుంది. ఇంద్రియ సుఖాలను భోగించాలి, ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి వంటి విషయాలపై వారి మనస్సు కేంద్రీకృతమై ఉంటుంది. మరియు, డబ్బు అనేది వీటన్నిటిని పొందటానికి సాధనం కాబట్టి ఇటువంటి మనుష్యులు జీవితాంతం డబ్బునే పట్టుకుని వ్రేళ్ళాడతారు. కర్మఫలములను భోగించాలనే కోరికచే ప్రేరేపితమైన సంకల్పము, రాజసిక (రజో గుణములో ఉన్న) సంకల్పముగా చెప్పబడినది.