Bhagavad Gita: Chapter 18, Verse 55

భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః ।
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్ ।। 55 ।।

భక్త్యా — ప్రేమయుక్త భక్తిచేత; మాం — నన్ను; అభిజానాతి — తెలుసుకుంటారు; యావాన్ — ఎంతటి వాడో; యః చ అస్మి — నేను ఉన్నట్టుగా; తత్త్వతః — యదార్థముగా; తతః — అప్పుడు; మాం — నన్ను; తత్త్వతః — యదార్థ స్వరూపంలో; జ్ఞాత్వా — తెలుసుకుని; విశతే — ప్రవేశిస్తారు; తత్-అనంతరమ్ — ఆ తరువాత.

Translation

BG 18.55: కేవలం నా పట్ల ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే, యదార్థముగా నేను ఎవరో (ఎంతటి వాడనో) తెలుకోవచ్చును. నన్ను తెలుసుకున్న పిదప, నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును.

Commentary

అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానములో స్థితుడై ఉన్న పిదప వ్యక్తి భక్తిని పొందుతాడు అని ఇంతకు క్రితం శ్లోకంలో శ్రీ కృష్ణుడు చెప్పి ఉన్నాడు. ఇక ఇప్పుడు, కేవలం భక్తి చేత మాత్రమే భగవంతుని యొక్క యదార్థ స్వరూపమును తెలుసుకోవచ్చు అని అంటున్నాడు. ఇంతకు క్రితం, జ్ఞాని భగవంతుడిని నిర్గుణ, నిర్విశేష, నిరాకార, బ్రహ్మన్ గా ఆచరణలో తెలుసుకుని ఉన్నాడు. కానీ, జ్ఞాని, భగవంతుని యొక్క సాకార రూపమును అనుభవించలేదు. ఆ సాకార రూప రహస్యము - కర్మ, జ్ఞానము, అష్టాంగ యోగము, మొదలైన ప్రక్రియల ద్వారా తెలుసుకోబడలేదు. కేవలం ప్రేమ మాత్రమే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది మరియు అందని దానిని అందిస్తుంది. భగవంతుని యొక్క రూపము, గుణములు, లీలలు, ధామములు, మరియు పరివారముల యొక్క నిగూఢత, ఆయన పట్ల అనన్య భక్తి ద్వారానే తెలుసుకోబడతాయి. ప్రేమ దృష్టి ఉండటం చేతనే భక్తులు భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతారు.

ఈ సత్యాన్ని అర్థం చేసుకోవటానికి పద్మ పురాణంలో ఒక చక్కటి కథ ఉంది.

జాబాలి అనే ఋషి ఒకసారి అడవిలో, ధ్యానం చేస్తున్న ఒక అత్యంత తేజోవంతమయిన మరియు ప్రశాంతమైన కన్యను చూసాడు. తనెవరో, తాను ఎందుకు ధ్యానం చేస్తున్నదో తెలియ చేయమని ఆమెను ఆ ఋషి ప్రార్థించాడు. ఆమె ఇలా సమాధానం ఇచ్చింది:

బ్రహ్మవిద్యాహమతులా యోగీమ్ ద్రైర్య చ మృగ్యతే
సాహం హరి పదాంభోజ కామ్యయా సుచిరం తపః
చరామ్యస్మిన్ వనే ఘోరే ధ్యాయంతి పురుషోత్తమం
బ్రహ్మానందేన పూర్ణాహం తేనానందేన తృప్తధీః
తథాపి శూన్యమాత్మానం మన్యే కృష్ణరతిం వినా

‘నేను బ్రహ్మ విద్యని (ఆత్మ గురించి తెలుసుకునే శాస్త్రము, అది అంతిమంగా భగవంతుని యొక్క బ్రహ్మన్ అస్తిత్వమును ఎఱుకలోకి తెస్తుంది). గొప్ప గొప్ప యోగులు, సాధువులు నన్ను తెలుసుకొనుటకు తపస్సులు చేస్తుంటారు. కానీ, సాకార రూప భగవంతుని పాదారవిందముల పట్ల భక్తి పెంపొందించుకోవటానికి నేనే స్వయంగా కఠినమైన తపస్సు ఆచరిస్తున్నాను. నేను బ్రహ్మానందములో తృప్తిగా మరియు నిండుగా ఉన్నాను. అయినా, శ్రీ కృష్ణుడి పట్ల ప్రేమానుబంధం లేకపోతే, వెలితిగా శూన్యంగా అనిపిస్తుంది.’ అని. ఈ విధంగా, కేవలం జ్ఞానం మాత్రమే ఉంటే అది భగవంతుని సాకార రూప ఆనందాన్ని ఆస్వాదించటానికి సరిపోదు. భక్తి ద్వారా మాత్రమే ఎవరైనా ఆ రహస్యం తెలుసుకోవచ్చు మరియు సంపూర్ణ భగవత్ భావనను పొందవచ్చు.