Bhagavad Gita: Chapter 18, Verse 42

శమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ ।
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్ ।। 42 ।।

శమః — ప్రశాంతత; దమః — (ఇంద్రియ) నిగ్రహణ; తపః — తపస్సు; శౌచం — స్వచ్ఛత; క్షాంతి — సహనము; ఆర్జవమ్ — చిత్తశుద్ధి; ఏవ — నిజముగా; చ — మరియు; జ్ఞానం — జ్ఞానము; విజ్ఞానమ్ — విజ్ఞానము; ఆస్తిక్యం — పునర్జన్మ-పరలోకం యందు విశ్వాసం; బ్రహ్మ — బ్రాహ్మణ వర్గం యొక్క; కర్మ — పని; స్వభావ-జమ్ — సహజ-స్వభావ గుణములచే జనించిన.

Translation

BG 18.42: శమము (ప్రశాంతత), దమము (ఇంద్రియ నిగ్రహణ), తపస్సు, స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము, మరియు ఇహపరలోకములపై విశ్వాసము - ఇవి బ్రాహ్మణుల సహజసిద్ధ స్వభావ కర్మ లక్షణములు.

Commentary

సాత్త్విక స్వభావము ప్రధానంగా కలవారు బ్రాహ్మణులు. వారి యొక్క ప్రధానమైన విధులు తపస్సు ఆచరించటం, అంతఃకరణ శుద్ధి అభ్యాసం చేయటం, భక్తి మరియు ఇతరులకు తమ నడవడికచే స్పూర్తినివ్వటం. ఈ విధంగా, వారు సహనంతో, వినమ్రతతో, మరియు ఆధ్యాత్మిక చిత్తముతో ఉంటారని అందరూ ఆశిస్తారు. తమ కోసం మరియు ఇతర వర్గాల కోసం కూడా వైదిక కర్మకాండలను చేస్తారని అందరూ ఆశిస్తారు. వారి సహజ స్వభావం వారిని జ్ఞాన-సముపార్జన పట్ల ఆసక్తిగా చేస్తుంది. కాబట్టి, ఉపాధ్యాయ వృత్తి - జ్ఞానాన్ని పెంపొందించుకుని మరియు దానిని ఇతరులతో పంచుకునే వృత్తి - కూడా వారికి అనుకూలంగా ఉండేది. వారు తామే స్వయంగా ప్రభుత్వ పరిపాలనలో పాలుపంచుకోకపోయినా, అధికారులకు దిశానిర్దేశం చేసేవారు. మరియు వారికి శాస్త్ర పరిజ్ఞానం ఉండేది కాబట్టి, సామాజిక మరియు రాజకీయ విషయాలపై వారి అభిప్రాయానికి చాలా విలువ ఉండేది.