శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ।। 47 ।।
శ్రేయాన్ — శ్రేష్ఠమైనది; స్వ-ధర్మః — తన స్వంత విహిత వృత్తి ధర్మలు; విగుణః — సరిగ్గా చేయకపోయినా; పర-ధర్మాత్ — ఇతరుల ధర్మలు; సు-అనుష్ఠితాత్ — చక్కగా చేసినా; స్వభావ-నియతం — వ్యక్తి యొక్క స్వభావము అనుసరించి; కర్మ — కర్తవ్యము; కుర్వన్ — చేయుటవలన; న-ఆప్నోతి — పొందరు; కిల్బిషమ్ — పాపము.
Translation
BG 18.47: పర (ఇతరుల) ధర్మమును సరిగ్గా చేయుటకంటే కూడా, సరిగా చేయలేకపోయినా సరే, తన స్వ-ధర్మము చేయుటయే వ్యక్తికి శ్రేష్ఠము. తన స్వభావ సిద్ధ విధులను చేయుటలో, వ్యక్తికి పాపము అంటదు.
Commentary
మనం మన స్వ-ధర్మమును (విధింపబడిన వృత్తి ధర్మములు) పాటిస్తున్నప్పుడు, రెండు విధాల ప్రయోజనం ఉంటుంది. అది మన స్వభావానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి, పక్షికి ఎగరటంలా లేదా చేపకు ఈదటంలా, అది మన వ్యక్తిత్వానికి సహజంగా ఉంటుంది. రెండవది ఏమిటంటే, మనస్సుకు సౌకర్యముగా ఉంటుంది కాబట్టి, అప్రయత్నంగానే మనం దాన్ని నిర్వర్తించవచ్చు, దానితో భక్తిలో నిమగ్నమవ్వటానికి అంతఃకరణ స్వేచ్ఛగా ఉంటుంది.
బదులుగా, అవి దోషపూరితముగా ఉన్నాయని మనం మన ధర్మములను విడిచిపెట్టి, మన స్వభావానికి అనుకూలంగా లేని ఇంకొకరి ధర్మములు ఎత్తుకుంటే, మనం మన సహజ సిద్ధ ప్రవృత్తికి విరుద్ధంగా ప్రయాసపడవలసి ఉంటుంది. అర్జునుడి పరిస్థితి సరిగ్గా ఇదే. అతని క్షత్రియ స్వభావము, సైనిక మరియు పరిపాలనా కార్యకలాపాల పట్ల మొగ్గు చూపుతుంది. పరిస్థితులు ఆయనను ధర్మయుద్ధంలో పాలుపంచుకునే అవసరం వైపు తీసుకువచ్చాయి. తన కర్తవ్యం నుండి తప్పించుకుని, అడవిలో తపస్సు కోసం, యుద్ధభూమి నుండి వెనుతిరిగితే అది అతని ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడదు; ఎందుకంటే, అడవిలో కూడా తన సహజ స్వభావం తన వెంటే ఉంటుంది. అక్కడ కూడా బహుశా, తను అడవిలో ఆటవికులని కూడగట్టుకుని వారికి నాయకుడిగా (రాజుగా) అయిపోవచ్చేమో. బదులుగా, తన స్వభావ సిద్ధంగా జనించిన విధులను నిర్వర్తిస్తూ ఉండి, తన కర్మ ఫలాలను అర్పించటం ద్వారా భగవత్ ఆరాధన చేయటమే మేలు.
ఎప్పుడైతే వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతాడో, అప్పుడు స్వ-ధర్మము మారుతుంది. అది ఇక శారీరక స్థాయిలోనే ఉండిపోదు; అది ఆత్మ స్థాయి ధర్మము గా మారిపోతుంది, అంటే భగవత్ భక్తి. ఆ స్థాయిలో, వ్యక్తి తన వృత్తి ధర్మములను త్యజించి, పూర్తిగా భక్తిలోనే నిమగ్నమవ్వటం తప్పు కాదు, ఎందుకంటే అదే అప్పుడు అతని సహజ స్వ-ధర్మమవుతుంది. అటువంటి అర్హత కలిగిన వ్యక్తులకు శ్రీ కృష్ణుడు అంతిమ ఉపదేశాన్ని భగవద్గీత చివర్లో ఇస్తాడు: ‘అన్ని రకాల ధర్మములను విడిచిపెట్టి, కేవలం నాయందే శరణుపొందుము’ (18.66). కానీ, ఆ స్థాయి వచ్చేవరకూ, ఈ శ్లోకంలో చెప్పిన ఉపదేశం వర్తిస్తుంది. అందుకే శ్రీమద్భాగవతం ఇలా పేర్కొంటుంది:
తావత్ కర్మాణి కుర్వీత న నిర్విద్యేత యావతా
మత్-కథా-శ్రవణాదౌ వా శ్రద్ధా యావన్ న జాయతే (11.20.9)
‘శ్రవణం, కీర్తనం, మరియు భగవత్ లీలల పై ధ్యానముచే భక్తి అంటే అభిరుచి వృద్ధి చెందనంతవరకూ, మనం మనకు విధింపబడిన వృత్తి ధర్మములను నిర్వర్తిస్తూనే ఉండాలి.’