బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి ।
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ।। 54 ।।
బ్రహ్మ-భూతః — బ్రహ్మన్ భావములో స్థితమై ఉన్నవాడు; ప్రసన్న-ఆత్మా — మానసిక ప్రశాంతతతో; న శోచతి — శోకింపడు; న కాంక్షతి — కాంక్షింపడు; సమః — సమ భావముతో; సర్వేషు — అన్నింటిపట్ల; భూతేషు — ప్రాణులు (భూతములు); మత్-భక్తిం — నా యందు భక్తిని; లభతే — పొందును; పరామ్ — సర్వోత్కృష్టమైన.
Translation
BG 18.54: పరబ్రహ్మంతో ఏకీభావ స్థితిలో ఉన్న వ్యక్తి మానసికంగా ప్రశాంతచిత్తముతో ఉంటాడు, దేనికీ శోకింపడు, దేనినీ కాంక్షింపడు. సర్వ భూతముల పట్ల సమత్వ భావముతో ఉంటూ, అటువంటి యోగి నా పరాభక్తిని పొందును.
Commentary
సంపూర్ణ సిద్ధి స్థాయి యొక్క తన వివరణను శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు ముగిస్తున్నాడు. బ్రహ్మ-భూతః అంటే బ్రహ్మన్ ను తెలుసుకున్న స్థితి. దాని యందే స్థితమై ఉండి, వ్యక్తి 'ప్రసన్నాత్మా', అంటే సంక్లిష్టమైన మరియు బాధాకరమైన పరిస్థితులలో కూడా ప్రశాంతముగా మరియు వాటిచే ప్రభావితం కాకుండా ఉంటాడు. 'న శోచతి' అంటే వ్యక్తి దేనికీ శోకింపడు లేదా ఎటువంటి కొరతని తలంచడు. ‘న కాంక్షతి' అంటే, వ్యక్తి తన ఆనందం కోసం ఎటువంటి భౌతిక వస్తువును కాంక్షింపడు. అటువంటి యోగి, అన్నింటిలో ఉన్నది బ్రహ్మమే అని గ్రహించి, సర్వ భూతములను సమ దృష్టిచే చూస్తాడు. ఈ స్థితిలో, వ్యక్తి అంతర్గత విజ్ఞాన జ్ఞానోదయ స్థితిలో ఉంటాడు. కానీ, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకాన్ని ఒక చక్కటి మలుపుతో ముగిస్తున్నాడు. ఇటువంటి జ్ఞానోదయ స్థితి/స్థాయిలో, వ్యక్తి భగవంతుని పరాభక్తి (దివ్య ప్రేమ) ను పొందుతాడు అని అంటున్నాడు.
భక్తి అనేది, బ్రహ్మన్-జ్ఞానోదయమునకు ఒక మధ్యమ మెట్టుగా మాత్రమే చేయతగినదని జ్ఞానులు తరచుగా అంటుంటారు. భక్తి అనేది అంతఃకరణ శుద్ధికి మాత్రమే ప్రయోజనకారి అని, మరియు ఈ పథంలో చివరికి కేవలం జ్ఞానమే మిగిలిపోతుందని అంటుంటారు. అందుకే, దృఢమైన బుద్ధి, వివేకము ఉన్నవారు, భక్తిని పక్కకుపెట్టి కేవలం జ్ఞానమునే పెంపొందించుకోవాలి అని సిఫారసు చేస్తారు. కానీ, ఈ పై శ్లోకం ఇటువంటి దృక్పథాన్ని ఖండిస్తుంది. అత్యున్నతమైన జ్ఞానోదయాన్ని పొందిన తరువాత, వ్యక్తి పరా భక్తిని పెంపొందించుకుంటాడు. వేద వ్యాసుడు ఇదే విషయాన్ని శ్రీమద్భాగవతంలో పేర్కొన్నాడు.
ఆత్మారామాశ్చ మునయో నిర్గ్రంథా అపి ఉరుక్రమే
కుర్వంతి ఆహైతుకీం భక్తిం ఇత్థం-భూత-గుణో హరిః (1.7.10)
‘ఆత్మారాములు (ఆత్మ యందే రమించేవారు), ఆత్మ జ్ఞానములోనే స్థితమై, భౌతిక బంధాలనుండి విముక్తులైనవారు - ఇటువంటి సిద్ధులైన జీవులు కూడా భగవంతుని పట్ల భక్తిని కలిగిఉండాలని కోరుకుంటారు. భగవంతుని మహాద్భుతమైన గుణములు ఎటువంటివి అంటే అవి ముక్త-జీవులను కూడా ఆకర్షిస్తాయి.’ ఆత్మ జ్ఞానాన్ని పొంది, నిరాకార బ్రహ్మన్ ను ఆచరణలో తెలుసుకున్న స్థితిలో ప్రఖ్యాత జ్ఞానులు ఎందరో ఉన్నారు. కానీ, వారికి ఎప్పుడైతే వారికి అలౌకికమైన భగవంతుని దివ్య గుణముల క్షణదర్శనము లభించిందో, వారు సహజంగానే భక్తి మార్గంలో ఆకర్షితులయ్యారు. నాలుగు యుగాలలో ప్రతి యుగం నుండీ ఉన్న ఇటువంటి జ్ఞానుల ఉదాహరణలు క్రింద ఇవ్వబడ్డాయి.
సత్య యుగపు మహా జ్ఞానులు బ్రహ్మ గారి నలుగురు కుమారులు - సనత్ కుమార్, సనాతన కుమార్, సనక్ కుమార్, మరియు సనందన కుమార్. వారు పుట్టుకతోనే ఆత్మజ్ఞాన సంపన్నులు, మరియు వారి మనస్సులు నిత్యమూ నిరాకార బ్రహ్మన్ యందే నిమగ్నమై ఉండేవి. ఈ నలుగురు కుమారులు ఒకసారి విష్ణుమూర్తి నివాసమైన వైకుంఠాన్ని సందర్శించారు. అక్కడ భగవంతుని యొక్క పాదారవిందముల వద్ద నుండి తులసి ఆకుల పరిమళం వారి ముక్కుపుటాలను తాకింది, అది వారి హృదయంలో అమితమైన ఆనందాన్ని రేకెత్తించింది. తక్షణమే, నిర్గుణ బ్రహ్మం పై వారి ధ్యానం అంతమై పోయింది మరియు వారు విష్ణుమూర్తి యొక్క దివ్య ప్రేమానందములో మునిగి పోయారు. వారు ఒక వరం కోసం వేడుకున్నారు:
కామం భవః స్వ-వృజినైర్నిరయేషు నః స్తాత్
చేతోఽలివద్యది ను తే పదయో రమేత
(భాగవతం 3.15.49)
‘ఓ స్వామీ, నీ పాదారవిందముల నుండి జాలువారే దివ్య ప్రేమానందమును గ్రోలే అవకాశం మా మనస్సుకు లభించినంత కాలం, నీవు మమ్ములను నరకానికి పంపినా మాకు సమ్మతమే.’ ఒక్కసారి ఊహించండి, నిరాకార బ్రహ్మంను అనుభవించిన తరువాత కూడా, ఈ వరిష్ఠమైన జ్ఞానులు, భగవంతుని సగుణ రూపము యొక్క ఆనందమును అనుభవించుటకు, నరకములో కూడా ఉండటానికి వెనుకాడలేదు.
ఇక ఇప్పుడు త్రేతాయుగమునకు వద్దాము. ఈ యుగపు మాహా జ్ఞాని, జనక మహారాజు. ఆయన శ్రీరామ చంద్ర ప్రభువు యొక్క నిత్యసఖి సీతమ్మవారి త్రండ్రి గారు. ఆయనకే విదేహుడు అనే పేరు కూడా ఉన్నది, అంటే శారీరక దృక్పథానికి అతీతుడు అన్నమాట. ఆయన మనస్సు నిత్యమూ నిరాకార బ్రహ్మం పట్లనే రమిస్తూ ఉండేది. కానీ, ఒకరోజు, విశ్వామిత్ర మహర్షి ఆయనను కలవటానికి శ్రీ రామచంద్రుడు మరియు లక్ష్మణుడుతో సహా వచ్చాడు. అప్పుడు ఏమయ్యిందో రామాయణంలో వివరించబడినది.
ఇన్హహి బిలోకత అతి అనురాగా, బరబస బ్రహ్మసుఖహి మన త్యాగా
‘రామచంద్ర ప్రభువుని చూసిన జనక మహారాజు నిరాకార బ్రహ్మన్ యొక్క ఆనందము పై ఆసక్తిని కోల్పోయాడు, మరియు భగవంతుని సాకార రూపము పట్ల గాఢంగా ఆసక్తుడై పోయాడు.’ ఈ విధంగా, తేత్రాయుగపు మోహోన్నత జ్ఞాని, భక్తి పథంలోకి వచ్చాడు.
ద్వాపర యుగపు మహోన్నత జ్ఞాని, వేద వ్యాసుని పుత్రుడు, శుకదేవుడు. ఆయన ఎంత ఉన్నతుడు అంటే, బయటకు వస్తే, భౌతిక శక్తి, మాయ, తనను వశపరుచుకుంటుందని, తల్లి గర్భంలోనే పన్నెండు సంవత్సరములు ఉన్నాడు అని పురాణములు మనకు చెపుతున్నాయి. చివరికి, నారద మహర్షి వచ్చి, తల్లి చెవుల ద్వారా ఆయనతో మాట్లాడి, బయటకు వస్తే ఏమీ కాదులే అని హామీ ఇచ్చి, తనను తల్లి గర్భం నుండి బయటకు రమ్మని వేడుకున్నాడు. ఆ తరువాత, ఆయన బయటకు వచ్చి తన యోగ శక్తి చే, తన శరీరాన్ని పన్నెండు సంవత్సరముల బాలుడిగా పెద్దదిగా చేసుకుని, ఇంటిని వదిలి, సన్యసించి అడవిలో నివసించటానికి వెళ్లిపోయాడు. అక్కడ, త్వరితగతిన అత్యున్నత సమాధి స్థితికి చేరుకున్నాడు.
అలా సంవత్సరములు గడచిన పిదప, వేద వ్యాసుని శిష్యులు అడవిలో కట్టెలు కొడుతూ, ఆయనను సమాధి స్థితిలో చూసారు. వారు తిరిగివెళ్ళి వేదవ్యాసునికి ఆ విషయం చెప్పారు. ఆయన శుకదేవుని చెవిలో, శ్రీ కృష్ణుడి స్వరూప అందాన్ని వివరించే ఒక శ్లోకం చెప్పమని చెప్పాడు:
బర్హాపీడం నట-వర-వపుః కర్ణయోః కర్ణికారం
బిభ్రద్ వాసః కనక-కపిశం వైజయంతీం చ మాలాం
రంధ్రాన్ వేణోరధర-సుధయాపూరయన్ గోప-వృందైర్
వృందారణ్యం స్వ-పద-రమణం ప్రావిశద్ గీత కీర్తిః (భాగవతం 10.21.5)
‘శ్రీ కృష్ణుడు శిరస్సుపై నెమలి పింఛముతో ఉన్న కిరీటముతో అలంకరింపబడి ఉన్నాడు, తన స్వరూపాన్ని గొప్ప నర్తకుడిగా చూపిస్తున్నాడు. ఆయన చెవులు నీలి కర్ణికా పుష్పములచే అలంకరింపబడి ఉన్నవి. ఆయన శాలువా బంగారు వర్ణముతో మెరిసిపోవుచున్నది. ఆయన వైజయంతీ పూసల మాలను మేడలో ధరించి ఉంటాడు. తన వేణువు యొక్క రంధ్రములను తన అధరామృతముతో నింపేస్తాడు. ఆయన బృందావనము చేరగానే, గోపబాలురచే చుట్టుముట్టబడి, కీర్తించబడుతాడు. ఆయన పాద గుర్తులు ఆ నేల సౌందర్యాన్ని మరింత ఇనుమడింప చేస్తాయి.’ ఈ శ్లోకము తన చెవులలోనికి ప్రవేశించిన సమయంలో, శుకదేవుడు నిరాకార బ్రహ్మన్లో లీనమై ఉన్నాడు. అకస్మాత్తుగా, ఆయన ధ్యాన విషయం, మైమరిపించే శ్రీ కృష్ణ భగవానుని స్వరూపంపైకి మారింది. భగవంతుని సాకార రూపం పట్ల ఎంత గాఢంగా ఆకర్షింపబడ్డాడంటే, తన సమాధిని వదిలి, తండ్రి వేద వ్యాసుని దగ్గరకి వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర నుండి, సంపూర్ణ భక్తి మాధుర్యముతో నిండినటువంటి, శ్రీమద్ భాగవతమును విన్నాడు; తదుపరి కాలంలో, గంగానది తీరంలో, అర్జునుడి మనువడైన, పరీక్షిత్ మహారాజుకి దాన్ని చెప్పాడు. ఈ విధంగా, ద్వాపర యుగపు అత్యున్నత జ్ఞాని, భక్తి పథంలో ఆకర్షింపబడ్డాడు.
చివరికి, ఇక కలి-యుగానికి వద్దాము. జగద్గురు శంకరాచార్య కలియుగపు అత్యున్నత జ్ఞానిగా పరిగణించబడుతాడు. అద్వైత వాద తత్త్వమును ప్రాచుర్యం లోనికి తెచ్చినది ఈయనే అని చెప్పబడుతాడు; దీనిలో వారు చెప్పినదేమిటంటే, సృష్టిలో ఉన్నది ఒక్కటే అని, అదే నిర్గుణ (గుణములు లేకుండా ఉన్నది), నిర్విశేష (లక్షణములు లేకుండా), నిరాకార (ఆకారము లేకుండా) బ్రహ్మము అని చెప్పారు. కానీ, ఎంతోమందికి తెలియని విషయం ఏమిటంటే, ఆయన ఇరవై సంవత్సరాల వయస్సు నుండి ముప్పైరెండు సంవత్సరముల వయస్సులో శరీరాన్ని విడిచిపెట్టే వరకు, ఆయన, శ్రీకృష్ణ భగవానుడు, శ్రీరామ చంద్ర ప్రభువు, శివుడు, మరియు దుర్గామాత లపై వందల శ్లోకాలని రచించారు. నాలుగు ధామాలను (చార్-ధామ్) కూడా దర్శించి, భగవంతుని యొక్క సాకార రూప విగ్రహాలను కూడా ఆరాధించారు. ప్రబోధ సుధాకరంలో ఆయన ఇలా వ్రాసారు:
కామ్యోపాసనయార్థయన్త్యనుదినం కించిత్ ఫలం స్వేప్సితం
కేచిత్ స్వర్గమథాపవర్గమపరే యోగాదియజ్ఞాదిభిః
అస్మాకం యదునందనాంఘ్రియుగళధ్యానావధానార్థినాం
కిం లోకేన దమేన కిం నృపతినా స్వర్గాపవర్గైశ్చ కిమ్ (250వ శ్లోకము)
‘స్వర్గాది లోకాల ప్రాప్తి కోసం పుణ్యకర్మలు చేసేవారు ఆ విధంగా చేసుకోవచ్చు. జ్ఞాన మార్గంలో లేదా అష్టాంగ యోగ మార్గంలో మోక్షం కోసం కోరుకునేవారు, ఆ విధంగా చేసుకోవచ్చు. నాకు మాత్రం, ఇవేవీ మార్గాలు వద్దు. కేవలం శ్రీ కృష్ణుడి పాదారవిందముల అమృతములో నిమగ్నమైపోవటాన్నే నేను కోరుకుంటాను. నాకు స్వర్గలోక లేదా ఈలోక ప్రాపంచిక సుఖాలు వద్దు. మోక్షం కూడా అక్కరలేదు. దివ్య ప్రేమానందమును ఆస్వాదించే రసికుడను నేను.’
నిజానికి శంకరాచార్యులవారు ఒక గొప్ప కృష్ణ భక్తుడు. ఆయన యొక్క భాష్యంలో చెప్పబడిన విషయం ఆ యొక్క కాల పరిస్థితులలో ఆవిధంగా అవసరమైనది. ఆయన ఈ భూమిపై అవతరించినప్పుడు, భారత దేశంలో బౌద్ధ మతం పూర్తిగా వ్యాపించి ఉంది. అటువంటి పరిస్థితిలో, భౌద్ధులకు మళ్లీ వేదములపై విశ్వాసం కలిగించటానికి, తనభాష్యాలు వ్రాసే టప్పుడు భక్తిని ప్రక్కకు పెట్టాడు. కానీ, తరువాత, సాకార భగవంతుని పై ఎన్నో స్తుతులను వ్రాయటంలో, తనలోనవున్న భక్తిని తెలియపరిచారు. ఈ విధంగా, మహోన్నత జ్ఞానోదయ స్థితికి చేరినవారు, ఆ తదుపరి, భక్తిలో నిమగ్నమయ్యారు అనటానికి, కలియుగంలో శంకరాచార్యుల వారు ఒక ఉదాహరణ.