Bhagavad Gita: Chapter 18, Verse 71

శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః ।
సోఽపి ముక్తః శుభాల్లోకాన్ ప్ర్రాప్నుయాత్ పుణ్యకర్మణామ్ ।। 71 ।।

శ్రద్ధా-వాన్ — శ్రద్ధ/విశ్వాసము కలవారు; అనసూయః — అసూయ లేకుండా; చ — మరియు; శృణుయాత్ — వింటే; అపి — ఖచ్చితంగా; యః — ఎవరైతే; నరః — వ్యక్తి; సః — ఆ వ్యక్తి; అపి — కూడా; ముక్తః — విముక్తి పొంది; శుభాన్ — శుభకరమైన; లోకాన్ — లోకములు; ప్ర్రాప్నుయాత్ — పొందును; పుణ్య-కర్మణామ్ — పుణ్యాత్ముల.

Translation

BG 18.71: శ్రద్ధా విశ్వాసముతో, అసూయ లేకుండా, ఈ జ్ఞానాన్ని కేవలం విన్న వారు కూడా పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు.

Commentary

శ్రీ కృష్ణుడికి, అర్జునుడికి మధ్య జరిగిన ఈ సంభాషణను అర్థం చేసుకునే వివేక సామర్థ్యము అందరికీ ఉండకపోవచ్చు. అటువంటి వారు కేవలం శ్రద్ధావిశ్వాసముతో దీనిని కేవలం విన్నాసరే, వారు కూడా లాభపడతారు అని శ్రీకృష్ణుడు హామీ ఇస్తున్నాడు. వారిలోనే స్థితమై ఉన్న భగవంతుడు, వారి నిష్కపటమైన ప్రయాస గమనించి వారిని తగినరీతిలో సత్కరిస్తాడు.

జగద్గురు శంకరాచార్యుల గారి, ఒక శిష్యుడు, సనందుడు, గురించి ఉన్న ఒక కథ, ఈ విషయాన్ని చక్కగా వివరిస్తుంది:

సనందుడు అంతగా చదువురానివాడు, గురువు గారి ఉపదేశాన్ని, ఇతర శిష్యులలా అర్థం చేసుకోలేక పోయేవాడు. కానీ, శంకరాచార్యుల వారు ప్రవచనం చెపుతుంటే అత్యంత శ్రద్ధతో మరియు గొప్ప విశ్వాసంతో వినేవాడు. ఒక రోజు, అతను గురువు గారి బట్టలను నదికి ఆవల ఒడ్డున ఉతుకుతున్నాడు. ఉపదేశం చెప్పే సమయం అయింది, మరియు ఇతర శిష్యులు ఇలా అభ్యర్థించారు, ‘గురువుగారూ, దయచేసి ఉపదేశం ప్రారంభించండి.’ అని.

శంకరాచార్యులు, ‘కాసేపు ఆగుదాం; సనందుడు ఇక్కడ లేడు.’ అని బదులిచ్చారు.

‘కానీ గురువుగారూ, అతనికేమీ అర్థం కాదు’ అని అభ్యర్థించారు మిగతా శిష్యులు.

‘అది నిజమే; కానీ అతను అత్యంత శ్రద్ధావిశ్వాసంతో వింటాడు, కాబట్టి అతనిని నిరాశ పరచదలుచుకోలేదు’, అన్నాడు శంకరాచార్యుల వారు.

ఆ తర్వాత, శ్రద్ధ యొక్క మహిమని చూపించటానికి, శంకరాచార్యుల వారు ఇలా పిలిచారు, ‘సనందా! దయచేసి ఇలా రా.’ అని.

గురువు గారి మాటలు విన్న సనందుడు, ఏమాత్రం సంకోచించలేదు. నీటిపైనే పరిగెత్తాడు. వృత్తాంతం ప్రకారం, ఆయన పాదాలు పెట్టిన చోటల్లా, తామర పూవులు పైకొచ్చి ఆయనకు ఆధారంగా నిలబడ్డాయి. అలా, ఆవలి ఒడ్డుకి వెళ్లి, గురువు గారికి నమస్కరించాడు. అదే సమయంలో, చక్కటి సంస్కృతంలో, ఒక గురు స్తుతి ఆయన నోటినుండి వెలువడింది. మిగతా శిష్యులు దీనిని వింటూ ఆశ్చర్యానికి గురయ్యారు. తామర పూవులు ఆయన పాదాల క్రింద వచ్చాయి కాబట్టి, ఆయన పేరు ‘పద్మపాదుడు’ అయింది, అంటే, పాదముల క్రింద తామర పూలు కలవాడు అని అర్థం. ఆయన శంకరాచార్యుల వారి నలుగురి ప్రధాన శిష్యులలో ఒకడిగా అయ్యాడు, మిగతా వారు - సురేశ్వరాచార్య, హస్తామలక, మరియు త్రోటకాచార్య.

ఈ పవిత్ర సంభాషణను కేవలం విన్న వారు కూడా క్రమక్రమంగా పరిశుద్ధి అవుతారు అని ఈ పై శ్లోకములో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి హామీ ఇస్తున్నాడు.