న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః ।
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః ।। 40 ।।
న — కాదు; తత్ — అది; అస్తి — ఉండుట; పృథివ్యాం — భూమిపై; వా — లేదా; దివి — పైనున్న స్వర్గాది లోకాలు; దేవేషు — దేవతలలో; వా — లేదా; పునః — మరల; సత్త్వం — ఉండుట; ప్రకృతి-జైః — ప్రకృతి త్రిగుణముల ద్వారా జనించిన; ముక్తం — విముక్తి పొందిన; యత్ — అది; ఏభిః — వీటి ప్రభావం నుండి; స్యాత్ — ఉండును; త్రిభిః — మూడు; గుణైః — ప్రకృతి గుణములు.
Translation
BG 18.40: ఈ భౌతిక జగత్తు యందు - భూమిపై కానీ, లేదా, ఊర్ధ్వ స్వర్గాది లోకాలలో కానీ - ఏ ఒక్క ప్రాణి కూడా ఈ ప్రకృతి త్రిగుణముల ప్రభావానికి అతీతము కాదు.
Commentary
భౌతిక శక్తి అయిన - మాయ - మూడు వర్ణములలో ఉంటుంది అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు పేర్కొంటున్నది:
అజామేకాం లోహిత-శుక్ల-కృష్ణాం
బహ్వీః ప్రజాః సృజమానాం స-రూపాః
అజోహ్వేకో జుషమాణో ఽనుశేతే
జహాతి ఏనాం భుక్త-భోగాం అజోన్యః (4.5)
‘భౌతిక ప్రకృతి మూడు వర్ణములలో ఉంటుంది - తెలుపు, ఎరుపు, మరియు నలుపు, అంటే, దానికి మూడు గుణములు ఉంటాయి - సత్త్వము, రజస్సు, మరియు తమస్సు. విశ్వములోని అసంఖ్యాకమైన జీవులకు అది మాతృ-గర్భము వంటిది. పుట్టుకలేని, సంపూర్ణ జ్ఞాన స్వరూపుడైన ఆ భగవంతునిచే అది అస్తిత్వములోనికి తీసుకురాబడి, ఆయనచే నిర్వహించబడుతున్నది. కానీ, భగవంతునికి ఈ భౌతిక శక్తి అంటదు. ఆయన తనకుతాను వేరుగా అలౌకిక లీలానందమును రమిస్తుంటాడు. కానీ, జీవుడు దానిని భోగిస్తూ తద్వారా బద్ధుడై పోతాడు.’
నరక లోకాల నుండి బ్రహ్మ లోకం వరకూ మాయ యొక్క పరిధి ఉంటుంది. ప్రకృతి త్రిగుణములు - సత్త్వము, రజస్సు, మరియు తమస్సులు, మాయ యొక్క అంతర్లీన గుణములు కాబట్టి, అవి అన్ని భౌతిక లోకాలలో ఉంటాయి. అందుకే, ఈ లోకాలలో ఉండే సమస్త జీవ రాశులు, వారు మానవులైనా లేదా దేవతలైనా, ఈ త్రి-గుణముల ప్రభావంలోనే ఉంటారు. ఉన్న తేడా అంతా ఈ గుణములు ఉండే పాళ్ళు వేర్వేరుగా ఉండటమే. నిమ్న లోకాలలో నివసించేవారు తమోగుణము ప్రధానంగా కలిగి ఉంటారు; భూలోకంలో ఉండేవారు రజోగుణ ప్రధానంగా ఉంటారు; మరియు స్వర్గాది లోకాలలో ఉండేవారు సత్త్వ గుణ ప్రధానంగా ఉంటారు. ఇక ఇప్పుడు ఈ మూడు చలరాశుల పరంగా, మానవులు ఎందుకు భిన్నమైన స్వభావములను కలిగి ఉంటారో, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు.