Bhagavad Gita: Chapter 18, Verse 38

విషయేంద్రియసంయోగాత్ యత్తదగ్రేఽమృతోపమమ్ ।
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్ ।। 38 ।।

విషయ — ఇంద్రియ విషయములతో; ఇంద్రియ — ఇంద్రియముల; సంయోగాత్ — సంపర్కము చేత; యత్ — ఏదైతే; తత్ — అది; అగ్రే — మొదట్లో; అమృత-ఉపమమ్ — అమృతము వలె; పరిణామే — చివరికి; విషం-ఇవ — విషము లాగా; తత్ — అది; సుఖం — సుఖము; రాజసం — రాజసికమైనది (రజో గుణములో ఉన్న); స్మృతమ్ — అని చెప్పబడును.

Translation

BG 18.38: ఇంద్రియములతో ఇంద్రియ వస్తువిషయముల సంపర్కముచేత కలిగిన సుఖమును రాజసిక (రజో గుణ) సుఖము అని అంటారు. ఈ సుఖానందము మొదట్లో అమృతంలా ఉన్నా చివరికి విషంలా ఉంటుంది.

Commentary

రాజసిక సుఖము అనేది ఇంద్రియములకు ఇంద్రయవస్తువిషయ సంపర్కము కలిగినప్పుడు అనుభవించే అనుభూతి; కానీ ఆ కలయిక మాదిరిగానే సుఖానందము కూడా తాత్కాలికమే; ఈ ప్రక్రియలో అది దురాశ, ఆందోళన, అపరాధభావన, మరియు మరింత భౌతిక భ్రాంతిని కలుగచేస్తుంది. భౌతిక జగత్తులో కూడా, అర్థవంతమైన పురోగతి సాధించాలంటే, రాజసిక సుఖాన్ని త్యజించవలసి ఉంటుంది. తక్షణమే లభించేవి కానీ తప్పుదారి పట్టించే సుఖాల నుండి తనను తాను దూరంగా ఉంచుకోవటానికి, భారత దేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి, జవహర్ లాల్ నెహ్రు, ‘స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఎ స్నోఇ ఈవినింగ్’ (Stopping by Woods on a Snowy Evening) అనే కవితలోని కొన్ని ఈ క్రింది వాక్యాలను తన బల్లపై ఉంచుకునే వాడు.

The woods are lovely, dark, and deep, (ఆరుబయట చాలా అందంగా ఉంది)
But I have promises to keep, (కానీ, నేను ఎన్నో వాగ్దానాలను నెరవేర్చాల్సి ఉంది)
And miles to go before I sleep, (విశ్రాంతి తీస్కునేముందు ఇంకా ఎంతో పయనించాల్సి ఉంది)
And miles to go before I sleep. (విశ్రాంతి తీస్కునేముందు ఇంకా ఎంతో పయనించాల్సి ఉంది)

నిత్య శాశ్వతమైన దివ్య ఆనందం కోసం ఉన్న మార్గము - భోగాలను అనుభవించటంలో లేదు - కానీ, త్యాగము, తపస్సు, మరియు క్రమశిక్షణ లోనే ఉన్నది.