Bhagavad Gita: Chapter 18, Verse 41

బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప ।
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః ।। 41 ।।

బ్రాహ్మణ — బ్రాహ్మణులలో; క్షత్రియ — యోధులు మరియు పరిపాలకుల తరగతి; విశాం — వ్యాపారులు మరియు వ్యవసాయదారుల తరగతి; శూద్రాణాం — కాయకష్ట పని చేసేవారు; చ — మరియు; పరంతప — అర్జునా, శత్రువులను వశపరుచుకునే వాడా; కర్మాణి — విధులు; ప్రవిభక్తాని — కేటాయించబడినవి; స్వభావ-ప్రభవైః-గుణైః — వ్యక్తి యొక్క గుణములు మరియు స్వభావమునకు అనుగుణముగా ఉన్న పని.

Translation

BG 18.41: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు - వీరి యొక్క విధులు వారివారి లక్షణములకు అనుగుణంగా, వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి. (పుట్టుక పరంగా కాదు).

Commentary

సరిగ్గా సరిపోయే వృత్తి దొరకటం అంటే సరిగ్గా సరిపోయే జీవిత భాగస్వామి దొరకటం లాగానే అని ఎవరో చాలా బాగా చెప్పారు. కానీ, మనకు సరిగ్గా సరిపోయే వృత్తి మనమే ఎలా దొరికిచ్చుకోవాలి? ఇక్కడ, శ్రీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, జనులకు వారి వారి గుణముల ప్రకారంగా వారి వ్యక్తిత్వాన్ని ఏర్పరిచే విభిన్నమైన స్వభావాలు ఉంటాయి, అందుకే విభిన్న వృత్తిపర విధులు వారి వారికి అనుగుణముగా ఉంటాయి. ఈ యొక్క 'వర్ణాశ్రమ ధర్మములు' అనేవి, 'స్వభావ-ప్రభావైర్ గుణైః' , (వ్యక్తి యొక్క స్వభావ గుణములు ఆధారంగా ఉన్న పని) అనుసరించి ఉన్న ఒక శాస్త్రీయమైన సామాజిక ఏర్పాటు. ఈ వర్గీకరణ పద్ధతిలో, నాలుగు ఆశ్రమాలు ఉంటాయి (జీవిత స్థాయిలు) మరియు నాలుగు వర్ణములు (వృత్తులు) ఉంటాయి.

జీవిత ఆశ్రమాలు ఇవి:

1) బ్రహ్మచర్య ఆశ్రమం (విద్యార్థి జీవితం), అంటే, పుట్టుక నుండి 25 సంవత్సరముల వయస్సు వరకు ఉండేది.

2) గృహస్థ ఆశ్రమం (కుటుంబపర జీవనం), సాధారణ వైవాహిక జీవితం, అంటే 25 సంవత్సరముల వయస్సు నుండి 50 వరకు

3) వానప్రస్థ ఆశ్రమం (పాక్షిక సన్న్యాస జీవనం) అంటే 50 సంవత్సరముల వయస్సు నుండి 75 సంవత్సరముల వయస్సు వరకు, ఈ స్థితిలో కుటుంబములో ఉంటూనే సన్న్యాసమును అభ్యాసం చేయటం.

4) సన్యాస ఆశ్రమం, అంటే, 75 ఏళ్ల సంవత్సరాల వయస్సు నుండి ఆ పైకి, ఇందులో వ్యక్తి అన్ని కుటుంబపర విధులను త్యజించి, ఒక పవిత్ర ప్రదేశంలో (పుణ్య క్షేత్రం) నివసిస్తూ, మనసుని భగవంతుని యందే నిమగ్నం చేసేవారు.

బ్రాహ్మణులు (పౌరోహిత్యం చేసేవారు), క్షత్రియులు (యోధులు మరియు పరిపాలన చేసేవారు), వైశ్యులు (వ్యాపారం మరియు వ్యవసాయం చేసేవారు) మరియు శూద్రులు (కాయకష్టం చేసేవారు) అనేవి నాలుగు వర్ణములు (వృత్తి ధర్మములు). వర్ణములు అనేవి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఎప్పుడూ పరిగణింపబడలేదు. సమాజం మొత్తం భగవంతుని చుట్టూ, ఆయన సేవార్థమే ఉండేది కాబట్టి, అందరూ తమను మరియు సమాజాన్ని పోషించేందుకు తమ స్వాభావిక సహజ గుణముల ప్రకారంగా పని చేసేవారు; తద్వారా భగవత్ ప్రాప్తి దిశగా ముందుకెళ్లి, జీవితాన్ని సఫలం చేసుకునేవారు. ఈ విధంగా వర్ణాశ్రమ వ్యవస్థలో, భిన్నత్వంలో ఏకత్వం ఉండేది. ప్రకృతిలో భిన్నత్వం అనేది అంతర్గతంగా ఎల్లప్పుడూ ఉండేదే, దానిని పూర్తిగా నిర్మూలించలేము. మన శరీరంలోనే విభిన్నమైన అంగములు ఉన్నాయి, అవన్నీ వేర్వేరు పనులు చేస్తుంటాయి. అన్ని అంగములూ ఒకే పని చేయాలి అని ఆశించటం అవివేకం. వాటన్నిటినీ భిన్నముగా చూడటం అజ్ఞానం కాదు, అది వాటి యొక్క యదార్థ ప్రయోజనాన్ని చూడటమే. అదే విధంగా, మానవులలో ఉండే వైవిధ్యాన్ని కూడా మనం విస్మరించలేము. సమత్వమే ప్రధాన సూత్రం గా ఉన్న కమ్యూనిస్టు దేశాల్లో కూడా - సిద్ధాంతాలను, చట్టాలను ప్రతిపాదించే పార్టీ నాయకులు ఉంటారు; ఆయుధాలు ధరించి దేశాన్ని కాపాడే సైనికులు/సైన్య బలం ఉంటుంది; వ్యవసాయం చేసుకునే రైతులు ఉంటారు; శారీరక పనిచేసే ప్రారిశ్రామిక కార్మికులు ఉంటారు. ఎంత సమానంగా ఉంచాలని చూసినా ఈ నాలుగు రకాల వృత్తుల వారు అక్కడ కూడా ఉంటారు. వర్ణాశ్రమ వ్యవస్థ, మనుష్యులలో ఉన్న వైవిధ్యాన్ని గుర్తించింది మరియు వారివారి స్వభావాల అనుగుణంగా వారికి సరిపోయే వృత్తులను శాస్త్రీయంగా సిఫారసు చేసింది.

కానీ, కాలక్రమంలో, వర్ణాశ్రమ వ్యవస్థ భ్రష్టమైపోయింది, మరియు వర్ణము అనేది వ్యక్తి యొక్క గుణ-స్వభావం పై కాక, వాని యొక్క పుట్టుక పై ఆధారమైపోయింది. బ్రాహ్మణుల పిల్లలు, వారికి ఆ గుణాలు ఉన్నా-లేకున్నా, వారికి వారే బ్రాహ్మణులమని చెప్పుకోవటం మొదలు పెట్టారు. అంతేకాక, ఉన్నత, కులము తక్కువ కులము అన్న భావము ప్రబలిపోయింది, తక్కువ కులం వారిని చిన్నచూపు చూడటం మొదలయ్యింది. ఎప్పుడైతే ఈ వ్యవస్థ బిరుసుగా, పుట్టుక ఆధారంగా అయిపోయిందో, అది అస్తవ్యస్థమై పోయింది. ఈ సామాజిక దోషం కాలంలో ప్రబలింది, కానీ ఇది వర్ణాశ్రమ వ్యవస్థ యొక్క అసలు ఉద్దేశ్యం కాదు. తదుపరి కొన్ని శ్లోకాలలో, దాని అసలైన వర్గీకరణ ప్రకారంగా, శ్రీ కృష్ణుడు, వ్యక్తుల గుణములను వారి యొక్క సహజ వృత్తి లక్షణములతో అనుసంధానం చేసి వివరిస్తాడు.