యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః ।
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ।। 42 ।।
కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ ।
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ।। 43 ।।
యామ్ ఇమాం — ఇవన్నీ; పుష్పితాం — ఆకర్షణీయమైన; వాచం — మాటలు; ప్రవదంతి — అంటారు; అవిపశ్చితః — పరిమితమైన అవగాహన కలవారు; వేద-వాద-రతాః — వేదములోని ఫలశృతి మీద ఆసక్తి కలవారు; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; న అన్యత్ అస్తి — వేరేది ఏదీ లేదు; ఇతి — ఈ విధంగా; వాదినః — వాదిస్తారు; కామ-ఆత్మానః — ఇంద్రియ సుఖములపై ఆసక్తితో; స్వర్గ-పరాః — స్వర్గ లోకాలని పొంద గోరి; జన్మ-కర్మ-ఫల — ఉత్తమ జన్మ, మంచి ప్రతిఫలాలు; ప్రదాం — ఇచ్చే; క్రియా-విశేష — డాంబికమైన కర్మ కాండలు; బహులాం — చాలా; భోగ — భోగములు; ఐశ్వర్య — ఐశ్వర్యములు; గతిం — పురోగతి; ప్రతి — వైపున.
Translation
BG 2.42-43: పరిమితమైన అవగాహన కలవారు, స్వర్గలోక ప్రాప్తి కోసం, డాంభికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరచే మాటలకు ఆకర్షితులౌతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు. తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపచేసే వేదాల్లోని ఆయా భాగాలని ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ, ఐశ్వర్యం, ఇంద్రియ భోగాలు, మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు.
Commentary
వేదాలు మూడు భాగాలుగా విభజించబడ్డాయి. అవి: కర్మ-కాండ, జ్ఞాన-కాండ, మరియు ఉపాసన-కాండ. భౌతిక ప్రతిఫలాల కోసం మరియు స్వర్గాది ఉత్తమ లోక ప్రాప్తి కోసం ఆచరించే వైదిక కర్మలు, కర్మ-కాండలో సూచించబడ్డాయి. ఇంద్రియ భోగాలు కోరుకునే వారు వేదాలలోని ఈ భాగాన్ని స్తుతిస్తారు.
దేవతాలోకాల్లో ఉన్నతమైన భౌతిక విలాసములు ఉంటాయి మరియు అవి మరింత ఎక్కువ ఇంద్రియ సుఖాలను అనుభవించేందుకు అనువుగా ఉంటాయి. కానీ, స్వర్గలోకాలకు ఉద్ధరణ అనేది, ఏకకాలిక ఆధ్యాత్మిక ఉద్ధరణ అని చెప్పలేము. ఆ స్వర్గలోకాలు కూడా భౌతిక ప్రాపంచిక జగత్తులోని భాగమే, అక్కడికి వెళ్లిన పిదప పుణ్యం ఖర్చయిపోయిన తరువాత తిరిగి భూలోకానికి రావాల్సిందే. అవివేకులు, కొద్దిపాటి పరిజ్ఞానమే ఉన్నవారు, వేదాల ప్రయోజనం ఇంతే అనుకుని ఆ స్వర్గాది లోకాలకోసం పాటుపడుతారు. ఈ విధంగా వారు, భగవత్ప్రాప్తి కోసం ప్రయత్నించక, జీవన్మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు. కాబట్టి, ఆధ్యాత్మిక విజ్ఞానం కలవారు స్వర్గాన్ని కూడా తమ లక్ష్యంగా ఉంచుకోరు. ముండకోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:
అవిద్యాయామంతరే వర్తమానాః స్వయంధీరాః పండితం మన్యమానాః
జంఘన్య మానాః పరియంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధాః (1.2.8)
‘స్వర్గాది లోక భోగములను అనుభవించటం కోసం వేదోక్తములైన ఆడంబరమైన కర్మ కాండలు ఆచరించే వారు, తమకు తామే శాస్త్ర పండితులమనుకుంటారు, కానీ నిజానికి వారు వెఱ్రివారు. గుడ్డి వారికి గుడ్డివారు దారి చూపించేవంటి వారు.’